త్వరగా భూరికార్డుల సమస్యలకు పరిష్కారం
చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవి
కరీంనగర్,ఫిబ్రవరి8(జనంసాక్షి): భూరికార్డులకు సంబంధించి త్వరగా సమస్యలు పరిష్కరించుకోవాలని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్సూచించారు. ఫిబ్రవరి 25 తర్వాత ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చే అవకాశం ఉన్నందున రైతులు ఆలోపుగా భూసమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. భూసమస్యల పరిష్కారంలో,పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వడంలో రైతులను ఇబ్బందులకు గురి చేసినా, కార్యాలయాల చుట్టూ తిప్పించుకున్నా, డబ్బులు డిమాండు చేసినా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భూప్రక్షాళనలో భాగంగా చొప్పదండి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో ఇప్పటి వరకు ఆధార్ వివరాలు అందజేయని రైతులు వెంటనే రెవెన్యూ సిబ్బందికి అందజేయాలని సూచించారు. ఆయా మండలాలకు చెందిన ఎంపీపీలు, జడ్పీ సభ్యులు, అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, టీఆర్‌ఎస్ నాయకులు ప్రత్యేక చొరవ తీసుకొని ఆధార్ వివరాలు ఇవ్వని రైతులు, తప్పుగా వివరాలు ఇచ్చిన వారిని గుర్తించి త్వరగా ఇచ్చేలా చూడాలన్నారు. ఎక్కువ శాతం భూ సమస్యలు పరిష్కారం కాకపోవడానికి ప్రధాన కారణం రైతులు ఆధార్, పట్టాదారు వివరాలు కాకుండా ఇతరుల వివరాలు ఇవ్వడమేనని రెవెన్యూ అధికారులు తమ దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిపారు. కోర్టు కేసుల్లో ఉన్న భూములు తప్ప మిగిలి భూసమస్యలను 25వ తేదీలోపు పరిష్కారిస్తామని రెవెన్యూ అధికారులు తమకు హావిూ ఇచ్చినట్లు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.