త్వరలో తెలంగాణపై నిర్ణయం వెలువడుతుంది
ఢిల్లీ పెద్దలు సానుకూలంగా ఉన్నారు
మంత్రి డీకే అరుణ
న్యూఢిల్లీ, అక్టోబర్ 11 (జనంసాక్షి):
త్వరలోనే తెలంగాణపై నిర్ణయం వెలువడుతుం దని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి డీకే అరుణ తెలిపారు. గురువారం మధ్యాహ్నం మీడియాతో ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్షను తెలిపేందుకు మహబూబ్‌నగర్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు తదితరులు బృందం గా ఏర్పడి ఢిల్లీకి వచ్చామన్నారు. కేంద్ర మంత్రులను కలుసుకుని తెలంగాణ ప్రజల ఆకాంక్షను తెలియజేశా మన్నారు. తమకు తెలంగాణ తప్ప మరోకటి వద్దని కేంద్రమంత్రులకు స్పష్టం చేశామ న్నారు. తెలంగాణపై ఇప్పటికే ఆలస్యమైందని అన్నారని ఆమె చెప్పారు. అదే విధంగా మహబూబ్‌నగర్ జిల్లా అభివృద్ధి విషయంలో వెనుకబడి ఉందని నిధులు ఇచ్చి
సహకరించాలని వారిని కోరామన్నారు. రైల్వే మంత్రి మునియప్పను కలిసి జిల్లాలో పెండింగ్‌లో ఉన్న రైల్వే పనులను చేపట్టాలని కోరామన్నారు. వికారాబాద్-కృష్ణా రైల్వే లైన్ చేపట్టాలని విజ్ఞప్తి చేశామన్నారు. అలాగే అలంపూర్, జోగిలాంబ రైల్వే స్టేషన్లను పునరుద్దరించాలని, గద్వాల రైల్వేకు ప్రధాన కూడలిగా మారనున్నందున రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని కోరామన్నారు. అలాగే మరో కేంద్ర మంత్రి జైరాం రమేష్ కలిసి తాగునీటి ప్రాజెక్టును ప్రకటించాలని, ఫ్లోరైడ్‌ను నివారించాలని డిమాండ్ చేశామన్నారు. మరో మంత్రి కిషోర్ చంద్రదేవన్ కలిసి జిల్లాలో చెంచులు అధికంగా ఉన్న ప్రాంతంలో అభివృద్ధికి గాను నిధులు ఇవ్వాలని కోరామన్నారు. అంతేగాక, రోడ్ల నిర్మాణాలకోసం 800కోట్లు అవసరమవుతాయని చెప్పామన్నారు. జిల్లా లోని అనేక విషయాలపై మంత్రులతో చర్చించామని, ఆదుకుంటామని వారు హామీ ఇచ్చారని అన్నారు.