త్వరలో వేములవాడ అభివృద్ధి పనులు: ఎమ్మెల్యే

కరీంనగర్‌,ఏప్రిల్‌2(జ‌నంసాక్షి): వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవస్థానం అభివృద్ధికి సంబంధించి పనులు త్వరలోనే ఊపందుకోనున్నాయమని  స్థానిక ఎమ్మెల్యే సిహెచ్‌ రమేశ్‌ తెలిపారు. ఎంతో ప్రాధాన్యత కలిగిన ఈ ఆలయ అభివృద్ధికి నిధులు విడుదల కావడంతో పనలుకు శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలిపారు.  తిరుమలలోని వేదిక్‌ యూనివర్సిటీ తరహాలో  వేములవాడలో ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు రూపొందించామని అన్నారు. ఈ ప్రతిపాదనలను సీఎంకు అందజేసినట్లు వెల్లడించారు. వివిధ అభివృద్ది పనులకు గాను రూ.150 కోట్లతో ప్రణాళిక రూపొందించామని  ఎమ్మెల్యే సీహెచ్‌ రమేష్‌ తెలిపారు.  ఆలయానికి రెండో ప్రాకారం నిర్మాణానికి, పార్కింగ్‌ స్థలంలో కోనేరు(ధర్మగుండం) నిర్మాణానికి ప్రతిపాదన చేశారు. గుడిచెరువు కట్టపై ట్యాంక్‌బండ్‌ నిర్మించి శిఖం వెంట 60 అడుగుల వెడల్పుతో రహదారి నిర్మించి ఇరువైపులా నెక్లెస్‌  రోడ్‌ మాదిరిగా పార్క్‌, మ్యూజియం, జ్ఞానమందిరం, చిన్నపిల్లల పార్క్‌ ఏర్పాటుకు అంచనాలు వేశారు. వీటిని సిఎంకు వివరించి నిధుల విడుదలకు కృషి చేస్తానన్నారు.