త్వరలో సినిమా చూద్దురు గానీ..
` ఇప్పటివరకు మీరు చూసింది కేవలం ట్రైలర్ మాత్రమే..
` మన హైదరాబాద్ కంఠంలో మరో మణిహారం
` శరవేగంగా నగర అభివృద్ధి
` రాష్ట్రంలో భేషుగ్గా శాంతిభద్రతలు
` కుట్రలు చేసేవారిని దూరం పెట్టాలి
` అభివృద్ది చేస్తున్న కేసీఆర్‌నే ఆశీర్వదించాలి
` విఎస్టీ స్టీల్ బ్రిడ్జి ప్రారంభించిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్(జనంసాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. సమైక్య పాలనలో నగరంలో ఏడాదికి వారం పది రోజులు కర్‌ఫ్యూలు ఉండేవన్నారు. అయితే స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనలో శాంతి భద్రతలు బాగున్నాయని చెప్పారు. పొరపాటు చేస్తే వందేండ్లు వెనక్కి వెళ్తుందన్నారు. కొందరు హైదరాబాద్‌లో కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. వారిపట్ల జాగ్రత్తగా ఉండాలని, పనిచేస్తున్న బిఆర్‌ఎస్‌ను ఆదరించాలని అన్నారు. హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు నుంచి వీఎస్టీ వరకు నిర్మించిన స్టీల్ బ్రిడ్జిని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రజల దశాబ్దాల కల నెరవేరిందన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత హైదరాబాద్‌లో ఇది 36వ ఫ్లై ఓవరని చెప్పారు. నూతన సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టుకున్నామన్నారు. అదేవిధంగా స్టీల్ బ్రిడ్జికి నాయిని నర్సింహా రెడ్డి పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశించారన్నారు.2001 నుంచి నాయిని ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట నిలిచారని వెల్లడిరచారు. దశాబ్దాలుగా కార్మిక నాయకుడిగా, రాష్ట్ర తొలి హోంమంత్రిగా పనిచేశారన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారని చెప్పారు. అందుకే ఆయన పేరు బ్రిడ్జికి పెట్టాలని నిర్ణయించామని అన్నారు. ఇందిరా పార్కును అంతర్జాతీయ ప్రమాణాలతో అద్భుతంగా తీర్చిదిద్దే బాధ్యత తమదని వెల్లడిరచారు. లోయర్ ట్యాంక్‌బండ్, అప్పర్ ట్యాంక్ బండ్‌ను కలిపి అద్భుతంగా మారుస్తామన్నారు. విశ్వనగరంగా హైదరాబాద్ ఎదగాలనే కలకు పునాది పడిరదని చెప్పారు. కేసీఆర్‌ను హ్యాట్రిక్ సీఎంగా మళ్లీ కూర్చోబెట్టాలన్నారు. రానున్న రోజుల్లో ప్రతిపక్షాలకు సినిమా చూపిస్తామని వెల్లడిరచారు.విశ్వనగరంగా హైదరాబాద్ ఎదగాలనే కలకు పునాది పడిరదని మంత్రి తారకరామారావు అన్నారు. రూ.450 కోట్లతో నిర్మించిన స్టీల్ బ్రిడ్జిని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, ఎంపీ కే.కేశవరావు, జీహెచ్‌ఎంసీ మేయర్ విజయలక్ష్మి, ఎమ్మెల్యే ముఠ గోపాల్ పాల్గొన్నారు.స్టీల్ బ్రిడ్జి ప్రారంభంతో నాలుగు జంక్షన్లలో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగిపోనున్నాయి. ఇందిరాపార్క్, అశోక్‌నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్లో ట్రాఫిక్ సమస్య లేకుండా బాగ్‌లింగంపల్లి వీఎస్టీ జంక్షన్‌కు సులభంగా చేరుకోవచ్చు. ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద ట్రాఫిక్ రద్దీ తగ్గిపోనుంది. ఉస్మానియా విశ్వవిద్యాలయం, హిందీ మహా విద్యాలయం వరకు వెళ్లేందుకు ప్రయాణ సమయం తగ్గిపోతుంది. స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవం కార్యక్రమం వద్ద బీఆర్‌ఎస్ నేతల హంగామా అంతా ఇంతా కాదు. ఇందిరాపార్క్ వీఎస్టీ మార్గంలో అధికారపార్టీ నేతలు పోటాపోటీగా ప్లెక్సీల ఏర్పాటు చేశారు. పరస్పర నినాదాలతో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్, నాయిని అల్లుడు శ్రీనివాస్ రెడ్డి, ఎమ్‌ఎస్ శ్రీనివాస్ బల ప్రదర్శనకు దిగారు. మంత్రి పర్యటన నేపథ్యంలో ఇందిరాపార్క్ వద్ద పోలీసులు విధించిన ఆంక్షలతో వాహనదారులు చుక్కలు చూసే పరిస్థితి ఏర్పడిరది. కేటీఆర్ పర్యటన సందర్భంగా ఇందిరాపార్క్ ప్రధాన రోడ్డు మార్గం మూసివేయడంతో వాహనదారుల అవస్థలు పడుతున్నారు. ఇటు పోలీసులు తీరు.. అటు బీఆర్‌ఎస్ నేతల హంగామాపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎస్సార్డీఏలో భాగంగా ఇందిరాపార్కు నుంచి వీఎస్టీ వరకు నాలుగు చౌరస్తాల విూదుగా 2.81 కి.విూల మేర రూ.450 కోట్లతో ఈ స్టీల్ వంతెన నిర్మించారు. ఈ వంతెన నిర్మాణంలో 12,500 మెట్రిక్ టన్నుల ప్రత్యేక అలాయ్ స్టీల్, 20 వేల క్యూబిక్ విూటర్ల కాంక్రీట్ వినియోగించారు. స్టీల్‌ను ఉక్రెయిన్ నుంచి తీసుకువచ్చారు. వంతెనలో మొత్తం 81 స్టీల్ పిల్లర్లు, 46 పైల్ ఫౌండేషన్లు ఉన్నాయి. నాలుగు లేన్లుగా నిర్మించిన దీనిలో 426 గర్డర్లు ఉన్నాయి. ఆర్టీసీ క్రాస్ రోడ్ చౌరస్తాలో మెట్రో కారిడార్ విూదుగా 26.54 విూటర్ల ఎత్తులో దీన్ని నిర్మించడం విశేషం. నగరంలో ఇప్పటి వరకు వంతెనల విూదుగా మెట్రో కారిడార్ ఉండగా.. ఇక్కడ మాత్రమే మెట్రో కారిడార్‌పై వంతెన నిర్మాణం జరిగింది. బయో డైవర్సిటీ తరహాలో రెండో లెవల్‌లో ఆర్టీసీ క్రాస్‌రోడ్ వద్ద స్టీల్ బ్రిడ్జి ఉంటుంది. ఎస్‌ఆర్‌డీపీలో పూర్తయిన వంతెనల్లో ఇది 20వది కాగా.. మొత్తం 47 పనులకుగాను 36 అందుబాటులోకి వచ్చినట్టవుతుంది. ఈ వంతెన అందుబాటులోకి రావడంతో అక్కడి ట్రాఫిక్ కష్టాలకు చెక్ పడనుంది. సాధారణ సమయాల్లో వీఎస్టీ నుంచి ఇందిరాపార్కు వద్దకు రావడానికి 15 నుంచి 20 నిమిషాలు పడుతుండగా.. స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభంతో కేవలం ఐదు నిమిషాల్లోనే చేరుకునే అవకాశం ఉంది.