దంతెవాడలో..  రెచ్చిపోయిన మావోలు


-ఆరాన్‌పూర్‌లో మెరుపుదాడికి దిగిన మావోలు
– దూరదర్శన్‌ కెమెరామెన్‌ మృతి
– ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు భద్రతా సిబ్బంది
– మావోల కోసం జల్లెడ పడుతున్న భద్రతా బలగాలు
దంతెవాడ, అక్టోబర్‌30(జ‌నంసాక్షి) : చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోసారి దుశ్చర్యకు పాల్పడ్డారు. దంతెవాడ జిల్లా ఆరాన్‌పూర్‌లో మంగళవారం మావోయిస్టులు జరిపిన మెరుపుదాడికి దిగారు. మావోల దాడిలో దూరదర్శన్‌ కెమెరామెన్‌తో పాటు ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు జవాన్లకు తీవ్రగాయాలయ్యాయి. దంతెవాడలో ఎన్నికల ప్రచారాన్ని కవర్‌ చేయడానికి దూరదర్శన్‌ బృందం అక్కడికి రాగా, అదే సమయంలో మావోయిస్టులు దాడికి పాల్పడ్డారు. మావోయిస్టుల దాడిలో రుద్ర ప్రతాప్‌, కానిస్టేబుల్‌ మంగళ్‌, ఢిల్లీకి చెందిన దూరదర్శన్‌ కెమెరామెన్‌ అచ్యుతానంద సాహు ప్రాణాలుకోల్పోయారని ఉన్నతాధికారులు తెలిపారు. మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారంతో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టిన సమయంలో దాడి జరిగినట్లు ఎస్పీ అభిషేక్‌ పల్లవ్‌ తెలియజేశారు. మావోల దాడిలో దూరదర్శన్‌ కెమెరామెన్‌, ఇద్దరు భద్రతా సిబ్బంది చనిపోయినట్టు చత్తీస్‌గఢ్‌ డీఐజీ సుందర్రాజ్‌ ధ్రువీకరించారు. ఈ ఘటనతో భద్రత దళాలు అప్రమత్తమయ్యాయి. పరిసర ప్రాంతాల్లో మావోయిస్టుల కోసం జల్లెడ పడుతున్నారు. దంతేవాడ, బీజాపూర్‌ ప్రాంతాల్లో అదనపు బలగాలను మొహరించినట్టు డీఐజీ స్పష్టం చేశారు. దాడి జరిగిన ప్రాంతానికి వంద మందికిపైగా సీఆర్పీఎఫ్‌ జవాన్లను తరలించినట్టు ఆయన పేర్కొన్నారు. ఇటీవలే బిజాపూర్‌ జిల్లాలో సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు ప్రయాణిస్తోన్న వాహనాన్ని మావోయిస్టులు పేల్చేసిన ఘటనలో నలుగురు మృతిచెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. చత్తీస్‌గఢ్‌ సహా ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలకు ఇటీవలే ఎన్నికల కమిషన్‌ షెడ్యూల్‌ ప్రకటించింది. 90స్థానాలున్న చత్తీస్‌గఢ్‌ శాసనసభకు రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబరు 12న తొలి దశ, 20న రెండో దశ పోలింగ్‌ నిర్వహించనున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో తొలి దశ పోలింగ్‌ నిర్వహించనున్నారు. సోమవారం చత్తీస్‌గఢ్‌ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు తగ్గుముఖం పట్టాయని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు చేసిన మర్నాడే మావోయిస్టులు దాడికి తెగబడటం గమనార్హం.
డీడీ కెమెరామెన్‌ కుటుంబాన్ని ఆదుకుంటాం – కేంద్ర మంత్రి
ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లా అర్నాపూర్‌ ఏరియాలో నక్సల్స్‌ దాడి చేయడంతో.. దూరదర్శన్‌ కెమెరామెన్‌, ఇద్దరు పోలీసులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి రాజ్యవర్థన్‌ సింగ్‌ రాథోడ్‌ స్పందించారు. డీడీ కెమెరామెన్‌ అచ్యుతానంద్‌ సాహూ మృతి చెందడం తీవ్ర దిగ్భాంత్రికి గురి చేసిందన్నారు. ఆయన కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉండి ఆదుకుంటామని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. విూడియా ప్రతినిధులందరికి సెల్యూట్‌ చేస్తున్నాను.. ఎందుకంటే భయంకరమైన పరిస్థితుల్లో కూడా వారు కవరేజ్‌ చేయడం గొప్ప విషయమన్నారు. జర్నలిస్టుల ధైర్యాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రి అన్నారు.