దక్షిణాఫ్రికా వేరియంట్‌ కలకలం..


` ఏయిడ్స్‌ రోగి నుంచి పుట్టుకొచ్చిన మ్యుటేషన్‌
` ప్రపంచదేశాలు అప్రమత్తంగా ఉండాలని నిపుణుల హెచ్చరిక
న్యూఢల్లీి,నవంబరు 26(జనంసాక్షి):కరోనా మహమ్మారి ఉద్ధృతి తగ్గుతున్న వేళ దక్షిణాఫ్రికాలో తాజాగా బయటపడ్ట బి.1.1.529 వేరియంట్‌.. మళ్లీ ఆందోళనకు గురిచేస్తోంది. ఈ వేరియంట్‌ కారణంగా మరో కొవిడ్‌ వేవ్‌ ముప్పు తప్పదని ప్రపంచ దేశాలు భయపడుతున్నాయి. అంతేగాక, దీనిలోని అధిక మ్యుటేషన్ల కారణంగా మునుపటి వేరియంట్ల కంటే వేగంగా వ్యాప్తి చెందే అవకాశాలున్నాయని, లక్షణాలు కూడా తీవ్రంగా ఉంటాయన్న వార్తలు ప్రపంచాన్ని కలవరపెడుతున్నాయి. మరి ఇంతకీ ఈ కొత్త వేరియంట్‌ ఎక్కడి నుంచి వచ్చింది..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
హెచ్‌ఐవీ పేషెంట్‌ నుంచేనా..?
బి.1.1.529 వేరియంట్‌ను తొలుత దక్షిణాఫ్రికాలో గుర్తించారు. ఈ వేరియంట్‌ ఎలా ఉత్పన్నమైందన్న దానిపై ఇప్పటివరకు శాస్త్రీయ ఆధారాలు లభించలేదు. అయితే రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ రోగిలో ఈ వేరియంట్‌ ఉత్పన్నమై ఉంటుందని లండన్‌లోని యూసీఎల్‌ జెనెటిక్స్‌ ఇనిస్టిట్యూట్‌కు చెందిన శాస్త్రవేత్త ఒకరు వెల్లడిరచారు. దక్షిణాఫ్రికాలో 8.2 మిలియన్లకు పైగా హెచ్‌ఐవీ బాధితులున్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా ఎయిడ్స్‌ రోగులున్న దేశం ఇదే. గతంలో దక్షిణాఫ్రికాలో బయటపడ్డ బీటా వేరియంట్‌ కూడా హెచ్‌ఐవీ సోకిన వ్యక్తి నుంచే ఉత్పన్నమైనట్లు ఆ మధ్య నిపుణులు తెలిపారు. దీంతో తాజా వేరియంట్‌ కూడా వారి నుంచే వచ్చి ఉంటుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.కరోనాలో ఇప్పటివరకు ఉన్న వేరియంట్ల కంటే బి.1.1.529 చాలా భిన్నమైనదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనిలో మొత్తం 50 మ్యుటేషన్లు ఉండగా.. ఒక్క స్పైక్‌ ప్రొటీన్‌లోనే 30కి పైగా ఉత్పరివర్తనాలు ఉన్నట్లు నిపుణులు తెలిపారు. డెల్టా వేరియంట్‌ కంటే కొత్త వేరియంట్‌లో మ్యుటేషన్లు చాలా ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోంది. మనిషి శరీరంలోకి వైరస్‌ ప్రవేశించడంలో స్పైక్‌ ప్రొటీనే కీలకంగా పనిచేస్తుంది. అక్కడే అధిక మ్యుటేషన్లు ఉండటంతో ఈ వైరస్‌ డెల్టా రకం కంటే వేగంగా వ్యాప్తి చెందే అవకాశముందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అయితే దీన్ని ధ్రువీకరించేందుకు ఇంకా స్పష్టమైన వివరాలు కావాలని చెబుతున్నారు. కొత్త వేరియంట్‌కు సంబంధించి దక్షిణాఫ్రికాలో ఇప్పటివరకు 100కి పైగా కేసులు బయటపడ్డాయి. ఆ దేశంలో కొత్తగా వైరస్‌ బారిన పడుతున్నవారిలో చాలా మందిలో ఇదే రకాన్ని గుర్తించినట్లు అక్కడి అధికారులు తెలిపారు. క్రమేపీ ఈ వేరియంట్‌ ఇన్ఫెక్షన్లు, పాజిటివిటీ రేటు కూడా పెరుగుతున్నట్లు చెబుతున్నారు. అంతేగాక, ఈ వైరస్‌ ఇతర దేశాలకు కూడా పాకుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే బోట్స్‌వానాలో నాలుగు కేసులను గుర్తించగా.. హాంకాంగ్‌లో రెండు కేసులు బయటపడ్డాయి. వైరస్‌ సోకిన వారంతా ఇప్పటికే రెండు డోసుల కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్నారట.బి.1.1.529 రకంలోని అధిక మ్యుటేషన్ల కారణంగా.. ఇది కొవిడ్‌ వైరస్‌ ప్రవర్తనపై ప్రభావం చూపనుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ టెక్నికల్‌ లీడ్‌ మరియా వాన్‌ కెర్ఖోవ్‌ అన్నారు. దీని ప్రభావాన్ని అర్థం చేసుకునేందుకు మరిన్ని వారాలు పడుతుందని తెలిపారు. ఈ వేరియంట్‌ సోకిన వారి రక్త నమూనాలను పరీక్షించగా.. వైరల్‌ లోడ్‌ ‘చాలా ఎక్కువ’గా ఉన్నట్లు తెలిసిందని ఎపిడెమిలాజిస్ట్‌ ఎరిక్‌ ఫీగెల్‌ డిరగ్‌ వెల్లడిరచారు. దీని వల్ల దక్షిణాఫ్రికాలో పాజిటివిటీ రేటు ఒక్క వారంలోనే 1శాతం నుంచి 30శాతానికి పెరిగిందని చెప్పారు. కొత్త రకంలోని మ్యుటేషన్ల కారణంగా ఈ వేరియంట్‌ మునుపటి రకాల కంటే అత్యంత వేగంగా వ్యాప్తి చెందే అవకాశముందని లండన్‌కు చెందిన మరో ఎపిడెమిలాజిస్ట్‌ నీల్‌ ఫెర్గ్యూసన్‌ అభిప్రాయపడ్డారు.
ప్రపంచ దేశాల ఆంక్షలు..
కొత్త వేరియంట్‌ నేపథ్యంలో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. విదేశీయుల రాకపై ఆంక్షలు విధించాయి. ఇప్పటికే యూకే, ఇజ్రాయెల్‌ వంటి దేశాలు.. దక్షిణాఫ్రికా, బోట్స్‌వానా సహా మరో నాలుగు ఆఫ్రికా దేశాల నుంచి విమానాల రాకపోకలను నిలిపివేశాయి. ఆస్ట్రేలియా కూడా ప్రయాణికులకు మళ్లీ కఠిన క్వారెంటైన్‌ నిబంధనలు అమలు చేసే పనిలో పడిరది. ఇటు భారత్‌ కూడా కొత్త వేరియంట్‌పై రాష్ట్రాలను హెచ్చరించింది.
కొత్త వేరియంట్‌ వేళ.. ఆ తప్పుడు భావన వీడండి..!
టీకా తీసుకున్నా జాగ్రత్తలు పాటించాలని కోరిన ఆరోగ్య సంస్థ
జెనీవా: ఐరోపాతో సహా ప్రపంచ వ్యాప్తంగా కొన్ని దేశాల్లో కరోనా విజృంభణ, దక్షిణాఫ్రికాలో పుట్టుకొచ్చిన కొత్త వేరియంట్‌ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) స్పందించింది. టీకా వేయించుకున్నప్పటికీ.. మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని అన్ని దేశాలకు సూచించింది. ఈ మేరకు ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనామ్‌ ట్వీట్‌ చేశారు. మహమ్మారి ముగిసిపోయిందని, టీకా పొందిన వారికి పూర్తి రక్షణ లభిస్తుందనే తప్పుడు భావన ప్రజల్లో నెలకొని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.‘విూరు కరోనా టీకా వేయించుకున్నప్పటికీ.. విూకు విూరే వైరస్‌ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ప్రమాదం పొంచి ఉన్న ఇతరులకు సోకకుండా జాగ్రత్తగా ఉండాలి. టీకాలు మహమ్మారిని పూర్తిగా అంతం చేశాయనే తప్పుడు భావన గురించి మేం ఆందోళన చెందుతున్నాం. అవి ప్రాణాలు కాపాడతాయి. కానీ.. వైరస్‌ వ్యాప్తిని పూర్తిగా అడ్డుకోవు అని స్పష్టం చేశారు
కొత్త వేరియంట్‌పై ఆరోగ్య సంస్థ అత్యవసర సమావేశం..
ఐరోపా, అమెరికా వంటి దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ.. ప్రపంచ వ్యాప్తంగా కాస్త ఊరట వాతావరణమే కనిపిస్తోంది. డెల్టా సృష్టించిన విలయం నుంచి ఇప్పుడే పలు దేశాలు ఊపిరి పీల్చుంటుకున్నాయి. ఈ సమయంలో దక్షిణాఫ్రికాలో బయటపడ్డ బి.1.1.529 వేరియంట్‌ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. దానిలో అసాధారణ మ్యుటేషన్ల కారణంగా మునుపటి వేరియంట్ల కంటే వేగంగా వ్యాప్తి చెందే లక్షణాలున్నాయని, వ్యాధి తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుందన్న వార్తలు ఇప్పుడు కలవరపెడుతున్నాయి. ఈ క్రమంలో ఈ కొత్త వేరియంట్‌పై శుక్రవారం ఆరోగ్య సంస్థ అత్యవసర సమావేశం నిర్వహించనుంది.