దగాపడ్డ తెలంగాణను మరింత దగా చేశారు
కుటుంబ పాలనతో ప్రజలను వంచించారు
ప్రచారంలో శ్రీధర్ బాబు విమర్శ
కరీంనగర్,నవంబర్27(జనంసాక్షి): నీళ్లు, నిధులు నియామకాల కోసం పోరాడి సాధించుకున్న తెలంగాణలో కెసిఆర్ కుటుంబ పెత్తనం సాగిస్తున్నారని మాజీమంత్రి, మంథని కాంగ్రెస్ అబ్యర్థి శ్రీధర్ బాబు అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కెసిఆర్ అవినీతిపై విచరాణ చేయిస్తామని అన్నారు. ప్రచారంలో భాగంగా ఆయన పలు ప్రాంతాల్లో పర్యటించారు. తెలంగాణ సెంటిమెంట్‌తో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రజలను నిండాముంచి ఫాంహౌజ్‌కే పరిమితమయ్యారన్నారు. సచివాలయానికి రాకుండా పాలన చేస్తున్న కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వచ్చినా లాభం లేదన్నారు. ప్రజలను పట్టించుకోకుండా కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తూ పబ్బం గడుపుకోవడం ఆయనకే చెల్లిందన్నారు. సచివాలయం లేదా ప్రగతి భవన్‌లో ప్రజలకు అందుబాటులో ఉంటానని కెసిఆర్ చెప్పగలరా అని శ్రీధర్ బాబు ప్రశ్నించారు. తెరాస అధినేత కేసీఆర్‌కు జిల్లాలో ఓట్లడిగే నైతిక హక్కులేదని కాంగ్రెస్ నేత అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కొండగట్టు బస్సు ప్రమాదంలో 64 మంది చనిపోయి 50 మందికి పైగా క్షతగాత్రులైతే గత రెండు నెలల కాలంలో ఒక్క కుఉటంబాన్ని కూడా పరామర్శించలేదన్నారు. ఎన్నికల ప్రచారం కోసం జిల్లాకు వచ్చినప్పుడు సానుభూతి వ్యక్తం కూడా చేయని అసమర్థ సిఎం కెసిఆర్ అని అన్నారు. కేసీఆర్‌కు ఓట్లే తప్ప పేదల ప్రాణాల పట్టింపులేదని అర్థం చేసుకోవచ్చన్నారు. ప్రాజెక్టుల పునరాకృతి పేరుతో దోపిడీ చేస్తున్న తెరాస ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదని అన్నారు. నాలుగేళ్ల తెరాస పాలనలో నియంతపాలన సాగించిన కేసీఆర్‌కు ఓటుతోనే బుద్ధి చెప్పాలని అన్నారు. దళితులు, ముస్లింలు, గిరిజనులు, విద్యార్థులు అందరినీ మోసం చేసి రాజకీయ అవినీతికి తెరలేపాడన్నారు. దళితులకు భూమి, రెండు పడకల గదుల ఇళ్లు, సింగరేణిలో కారుణ్య నియామకం ఏదీ జరగలేదన్నారు. తెలంగాణ ప్రజలు దొరహంకారాన్ని భరించరని రాజకీయ మార్పు కోసం కాంగ్రెస్ కూటమిని గెలిపించాలని అన్నారు. నాలుగున్నరేళ్లలో తెలంగాణ ఆకాంక్షలకు అనుగుణంగా సమస్యలు పరిష్కారం కాకపోగా దోపిడీకి గురైందని ఆరోపించారు. తెలంగాణలో యువతకు ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఓడిపోతే ఫాంహౌజ్‌కు వెళ్తానని చెబుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారం ఇస్తేనే ప్రజలకు సేవ చేస్తారా అని ప్రశ్నించారు. నిరుద్యోగులు ఇంకా ఉపాధి అవకాశాలు లేక కూలీ పనులు చేసుకునే పరిస్థితి ఉందని వాపోయారు. సింగరేణి భూగర్భ బొగ్గుగనులు ఏర్పాటు చేసి ఉద్యోగాలు కల్పిస్తామన్న ముఖ్యమంత్రి ఉపరితల గనులను తవ్విస్తూ బొందల గడ్డలుగా మార్చుతున్నారని మండిపడ్డారు. రామగుండం ప్రాంతానికి మైనింగ్ విశ్వవిద్యాలయం ఏర్పాటు, సింగరేణి కార్మికులకు ఆదాయపు పన్ను మినహాయిస్తామని ప్రకటించి ఎందుకు అమలు చేయించలేక పోయారని ప్రశ్నించారు. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని, కెసిఆర్‌కు ఓటేసి తెలంగాణను దొరలకు అప్పగించవద్దని అన్నారు.



