దడపుట్టిస్తున్న తిత్లీ తుఫాన్‌

– పెను తుఫానుగా మారిన ‘తిత్లీ’
– ఓడిశాలోని తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు
– తీరప్రాంతాల్లో రెడ్‌అలర్ట్‌ ప్రకటించిన ఒడిశా ప్రభుత్వం
– గంటకు 100 నుంచి 120 కి.విూ వేగంతో వీస్తున్న గాలులు
– పలుచోట్ల రంగంలోకి ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది
– ఏపీలోనూ ప్రభావం చూపనున్న ‘తత్లీ’
– ఉప్పాడ సముద్రతీరంలో ఎగిసిపడుతున్న అలలు
భువనేశ్వర్‌, అక్టోబర్‌10(జ‌నంసాక్షి) : ‘తిత్లీ’ తుపాను ఒడిశా, ఏపీ తీర ప్రాంతాల ప్రజలను దడపుట్టిస్తోంది. ఇప్పటికే ‘తిత్లీ’ ప్రభావంతో ఒడిశాలోని తీర ప్రాంతాల్లో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుండటంతోపాటు మరో రెండు రోజులు ఇదే తీవ్రత ఉండే అవకాశం ఉండటంతో ఇప్పటికే సహాయ సిబ్బందిని రంగంలోకి దింపారు. ‘తత్లీ’ బుధవారం మధ్యాహ్నం తీవ్రమైన తుపానుగా మారింది. ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు ఆగ్నేయ దిశలో 490 కిలోవిూటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమై ఉంది. ఇది ఒడిశా-ఆంధ్రా వైపు చురుగ్గా కదులుతోందని.. గురువారం ఉదయానికి గోపాల్‌పూర్‌- ఏపీలోని కళింగపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. ఈ సమయంలో భారీ వర్షాలతో పాటు 125 కిలోవిూటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది. ఇప్పటికే బంగాళాఖాతం అల్లకల్లోలంగా

ఉండడం.. గురువారం భారీ వర్షాలు, గాలుల నేపథ్యంలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో భారత వాతావరణ విభాగం రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది.
తీర ప్రాంతాల్లో రెడ్‌అలర్ట్‌ ప్రకటించిన ఒడిశా ప్రభుత్వం..
ముంచుకొస్తున్న తిత్లీ తుపాను ముప్పు నేపథ్యంలో తీర ప్రాంతాల్లో ఒడిశా ప్రభుత్వం రెడ్‌అలర్ట్‌ ప్రకటించింది. పూరీ, గంజామ్‌, గజపతి, జగత్‌సింగ్‌పూర్‌లోని విద్యాసంస్థలకు ముందస్తుగా సెలవులు ప్రకటించింది. జిల్లా కలెక్టర్లను అప్రమత్తం చేసింది. భువనేశ్వర్‌లోని ప్రత్యేక రిలీఫ్‌ కమిషనర్‌(ఎస్‌ఆర్‌సీ) కార్యాలయం పరిస్థితిపై నిఘా సారించింది. తీర ప్రాంతాల్లోని 889 ఆశ్రయ స్థలాల్లో ఆహారసామగ్రి, మందులు, కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు, ఇతర అత్యవసర సామగ్రి సిద్ధం చేసినట్లు డిప్యూటీ ఎస్‌ఆర్‌సీ ప్రభాత్‌ మహాపాత్ర్‌ చెప్పారు. భారీ వర్షాలు కురవనున్నాయన్న అంచనాల నేపథ్యంలో ఇప్పటికే 300 మోటారు పడవలు సిద్ధం చేశామని తెలిపారు. తుపాను తీవ్రతపై ఎప్పటికప్పుడు అధ్యయనం జరుగుతోందని.. దీనిపై ఐఎండీ వర్గాలతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. సహాయక చర్యలు అందించేందుకు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బందిని ముందస్తుగా కొన్నిచోట్ల నియమించామని తెలిపారు. పెద్ద ఎత్తున ఆహారపదార్ధాల నిల్వలను ప్రభావిత ప్రాంతాలకు చేరవేయడంతో పాటు ప్రజలను సైక్లోన్‌ షెల్టర్లకు తరలించనున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏపీ పాధి పేర్కొన్నారు. మరోవైపు గంజాం, గజపతి, పూరీ, జగత్‌సింగ్‌పూర్‌ ప్రాంతాల్లోని పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించారు. గతంలో 2013లో పైలిన్‌, 2014లో హుద్‌హుద్‌ తుపాన్‌ సమయంలో ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లకుండా విపత్తు నిర్వహణ చేపట్టామని ఆయన గుర్తుచేశారు. తిత్లీ తుపాన్‌ ధాటికి గంటకు 100 నుంచి 110 కివిూ వేగంతో గాలులు వీస్తాయని, గువారం నాటికి తుపాన్‌ విస్తరించి తీవ్రరూపు దాల్చుతుందని ఐఎండీ అంచనా వేసినట్టు వెల్లడించారు. ప్రభుత్వ కార్యదర్శులు, సహాయ పునరావాస కమిషనర్‌, ఎన్డీఆర్‌ఎఫ్‌ బలగాలతో ప్రధాన కార్యదర్శి నిర్వహించిన అత్యున్నత స్ధాయి సమావేశంలో తుపాన్‌ పరిస్థితిని సవిూక్షించారు. కాగా గురువారం ఒడిశాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ రెడ్‌అలర్ట్‌ జారీ చేసింది. కాగా తిత్లీ ప్రస్తుతం ఒడిశాలోని గోపాల్‌పూర్‌ తీరానికి 510 కి.విూ. దూరంలో ఏపీలోని కళింగపట్నం తీరానికి 460 కిలోవిూటర్ల దూరం మధ్య కేంద్రీకృతమైందని వాతావరణ విభాగం పేర్కొంది.
ఉప్పాడ తీరంలో ఎగిసిపడుతున్న అలలు..
‘తిత్లీ’ తుపాను ప్రభావంతో ఉప్పాడ తీరంలో అలలు ఎగిసిపడుతున్నాయి. బీచ్‌రోడ్డుపైకి అలలు దూసుకువస్తున్నాయి. రాగల 12 గంటల్లో తత్లీ తుఫాను తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో తీర ప్రాంతాల్లో అలల ఉధృతి అధికంగా ఉంది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోవిూటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. సముద్రం మొత్తం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
తత్లీ తుపాను కళింగపట్నానికి ఆగ్నేయంగా 340కిలోవిూటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. గురువారం తెల్లవారుజామున కళింగపట్నం- గోపాల్‌పూర్‌ మధ్య ఏపీని ఆనుకుని తీరం దాటే అవకాశం ఉంది. తుపాను తీరం దాటే సమయంలో దాదాపుగా 100 నుంచి 120 కిలోవిూటర్ల వేగంగా గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో తుపాను ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం శ్రీకాకుళం, ఒడిశా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. విశాఖ, విజయనగరం జిల్లాలో ఆకాశం మేఘావృతమై ఉంది. అటు తెలంగాణలోని
పలు ప్రాంతాల్లో చెదురుముదురు వర్షాలు పడే అవకాశం ఉంది.