దత్తాత్రేయ రాజీనామా ఆమోదం..

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రివర్గ విస్తరణలో ఊహించని మలుపులు చోటుచేసుకుంటున్నాయి. కేంద్ర మంత్రివర్గంలో తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తోన్న ఏకైక నాయకుడు బండారు దత్తాత్రేయ శుక్రవారం రాత్రి తన పదవికి రాజీనామా చేశారు.

ఆదివారం ఉదయం కొత్త మంత్రులు ప్రమాణం చేయనున్న దరిమిలా పాత మంత్రులు ఐదుగురు శుక్రవారం ఉదయం రాజీనామాలు చేశారు. వారిలో రాజీవ్‌ ప్రతాప్‌ రూడీ, ఉమాభారతి, కల్‌రాజ్‌ మిశ్రా, నిర్మలా సీతారామన్, సంజీవ్‌ బలియాన్, మహేంద్ర పాండేలు ఉన్నారు. ముందుగా అనుకున్న జాబితాలో కార్మిక, ఉపాధికల్పన శాఖ సహాయమంత్రి దత్తాత్రేయ పేరు ఎక్కడా వినిపించనప్పటికీ రాత్రిరాత్రే ఆయన చేత రాజీనామా చేయించడం అందరినీ విస్మయానికి గురిచేసింది.

సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ సభ్యుడైన దత్తాత్రేయ.. నాటి వాజపేయి హయాంలోనూ మంత్రిగా వెలుగొందారు. 2014 ఎన్నికల తర్వాత మొదటివిడతలోనే మంత్రి పదవి దక్కించుకున్నారు. ఇంకా రెండేళ్ల పదవీకాలం ఉండగానే  పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు పదవికి రాజీనామా చేశారు. దత్తన్నకు మరేదైనా పదవి ఇస్తారా లేదా తెలియాల్సిఉంది.