దళారులను నమ్మి మోసపోవద్దు

కామారెడ్డి,మే25(జ‌నంసాక్షి): రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని మార్కెటింగ్‌ అధికారులు అన్నారు. ఇక్కడ విక్రయించిన ధాన్యం డబ్బులను 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో జమచేస్తామని స్పష్టం చేశారు. క్వింటాలు మక్కలకు రూ.1425 మద్దతు ధర నిర్ణయించినట్లు చెప్పారు. భూమి ఉన్న ప్రతి రైతుకూ పంట పెట్టుబడి కోసం ఎకరానికి రూ.4 వేలు అందించామని, రెండో పంటకు కూడా రెండో విడతలో అందిస్తామన్నారు. ఈ డబ్బులతో నాణ్యమైన విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయాలని సూచించారు. రైతులకు విండోల ద్వారా ఎరువులు, విత్తనాలు సిద్ధంగా ఉంచామన్నారు. కొరత లేకుండా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. వచ్చే నెల నుంచి రైతులకు ప్రభుత్వం రూ.5 లక్షల ఇన్సూరెన్స్‌ సౌకర్యం అమలు చేయనుందని తెలిపారు. తమ ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోవద్దని, రైతులకు మద్దతు ధర అందించేందుకు ఏర్పాటు చేసిన ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోని విక్రయించాలని అన్నారు. రైతులు పండించిన పంట ఉత్పత్తులను కాజేయడానికి దళారులు వేచి ఉంటారని, వారి వద్దకు వెళ్తే మోసపోవడం ఖాయమన్నారు.