దళితులకు భూ పంపిణీకి ప్రాధాన్యం
మెదక్,ఆగస్ట్ 8(జనం సాక్షి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న దళితబస్తీలో అర్హులందరికీ మూడెకరాల వ్యవసాయ భూమిని అందజేస్తామని ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు. దళిత బస్తీ పథ కం కోసం భూమి లేని ఎస్సీ రైతులను గుర్తించి, వారికి ప్రభుత్వం తరుపున మూడెకరాల భూముల్ని ఇస్తామని చెప్పారు. అర్హులకు ఒక్కొక్కరికీ మూడెకరాల చొప్పున భూముల్ని త్వరలోనే అందజేస్తామన్నారు. ప్రభుత్వం అందజేసిన ఈ భూముల్ని రైతులు ఇతరులకు విక్రయించినట్లు ఫిర్యాదు అందితే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకొని, ఆ భూముల్ని వెనక్కి తీసుకుని ఇతర రైతులకు అప్పగిస్తామని చెప్పారు.రైతులు, గ్రామ అవసరాల ప్రకారం జాతీయ గ్రావిూణ ఉపాధి హావిూ పథకంలో పనులను చేపట్టి కూలీలకు వంద రోజుల పని దినాలను కల్పించాలని అన్నారు. గ్రామాల్లో రైతుల అవసరాలను గ్రామ అవసరాలను పనులు ప్రతిపాదించి నిర్వహించాలన్నారు. వాటర్ కన్జర్వేషన్‌పై ప్రజలకు అవగాహన కల్పించి ప్రతీ ఇంట్లో ఇంకుడు గుంతలను నిర్మించుకునేలా చూడాలని తెలిపారు. ప్రతి నీటి బొట్టునూ సంరక్షించి సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఊరురా కళాకారులతో విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని నిర్మించుకున్న వారి బిల్లుల చెల్లింపులు తక్షణమే చేల్లించాలన్నారు. రాష్ట్రాన్ని బహిరంగ మల విసర్జన రహిత రాష్ట్రంగా ప్రకటించనున్నామన్నారు.