దళితులను బీజేపీ ప్రభుత్వం అణచివేస్తోంధి కేజ్రీవాల్

arvind-kejriwal_5రాజ్కోట్: గుజరాత్ లో దళితులను బీజేపీ ప్రభుత్వం అణచివేస్తోందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు.  రాజ్కోట్ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న ఉనా ఘటన బాధితులను ఆయన శుక్రవారం పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. బాధ్యులను చట్టం ముందు నిలబెట్టాలని డిమాండ్ చేశారు. ఉనాలో దళితులపై దాడి చేసిన వారిపై పోలీసులు ఎందుకు చర్య తీసుకోలేదని ప్రశ్నించారు. పోలీసులు నిష్క్రియతో ప్రభుత్వం ప్రమేయం ఉందన్న అనుమానం కలుగుతోందన్నారు. గుజరాత్ సర్కారుకు దళితులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని కేజ్రీవాల్ మండిపడ్డారు.

గుజరాత్‌లోని గిర్ సోమనాథ్ జిల్లాలో ఉన్న ఉనాలో జులై 11న కొందరు దళితులు చనిపోయిన ఒక ఆవు చర్మాన్ని వలుస్తుండగా.. గమనించిన గో పరిరక్షణ సమితి సభ్యులు వారిపై దాడికి పాల్పడ్డారు. ఆవులను చంపి మరీ చర్మాన్ని వలుస్తున్నారంటూ వారిని బంధించారు. చనిపోయిన ఆవు చర్మాన్నే తీస్తున్నామన్నా వినిపించుకోకుండా వారి చేతులను కట్టేసి తీవ్రంగా కొట్టారు. ఆ తరువాత బాధితుల్లో ఏడుగురు ఆత్మాహత్యాయత్నం చేశారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమయ్యాయి. విపక్షాలు ఈ అంశాన్ని పార్లమెంట్ లో లేవనెత్తాయి.