దళితులను సాగు చేయనివ్వరు.
పెత్తందార్ల కబ్జాకు సహకరిస్తున్నారు.
పోటో: అటవీ అధికారులతో వాగ్వివాదానికి దిగిన దళిత రైతులు.
నెన్నెల, సెప్టెంబర్23,(జనంసాక్షి)
అటవీ అధికారులు రైతులపై వివక్ష చూపుతున్నారని, దళితులను భూములు సాగు చేసుకొనివ్వకుండా, పెత్తందార్లకు మాత్రం కబ్జాకు సహకరించి దళితులపై వివక్ష చూపుతున్నారని నెన్నెల మండల కేంద్రంలోని రైతులు గురువారం అటవీ, రెవెన్యూ శాఖల మధ్య వివాదాస్పద భూమిలో సాగుకు యత్నించారు. నెన్నెల శివారు సర్వే నెంబర్ 671లో చిప్పకుర్తి మల్లేష్ కు 4 ఎకరాల భూమి పట్టా ఉంది. ఇట్టి భూమి అటవీ, రెవెన్యూ శాఖల మధ్య వివాదం నడుస్తోంది. ఇట్టి భూమిలో గతంలో దళితులకు భూ పంపిణీ కింద దళితులకు, ఇతర సామాజిక వర్గాలకు ఆసైన్మెంట్ చేశారు. అప్పటి నుంచి అటవీశాఖ అధికారులు ఈ భూమి మాది అని ఆ భూమిలో సాగును అడ్డుకుంటున్నారు. అయితే కేవలం దళితులు సాగు చేస్తున్న భూమిని మాత్రమే అటవీశాఖ అధికారులు అడ్డుకుంటున్నారని, ఇతర సామాజిక వర్గాలకు చెందిన వారికి ఎలాంటి ఆసైన్మెంట్ లేకున్నా కబ్జాకు సహకరిస్తున్నారని బాధిత రైతు చిప్పకుర్తి మల్లేష్ ఆరోపిస్తున్నాడు. ఇట్టి సమస్యపై కోర్టును ఆశ్రయించినప్పటికి అటవీశాఖ అధికారులు కోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తున్నారని అగ్రహించాడు. అటవీ, రెవెన్యూ భూమిలో వివాదం నెలకొన్న విషయం తెలుసుకున్న మండల కేంద్రంలోని దళిత రైతులు అందరూ అక్కడికి చేరుకొని ఆందోళన చేపట్టారు. ఈసందర్భంగా కుశ్నపల్లి రేంజ్ అధికారి గోవింద్ చంద్ సర్దార్ మాట్లాడుతూ ఇట్టి భూమి అటవీ శాఖకు చెందినట్లు తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని, ఎవరైనా అక్రమంగా ప్రవేశించి సాగు చేసినట్లయితే కేసులు నమోదు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇట్టి భూమి వివాదానికి ప్రభుత్వం ఏవిధంగా నిర్దేశిస్తే ఆవిధంగా నడుచుకుంటామని, అప్పటి వరకు ఎవరు కూడా వివాదాస్పద భూమిలో ఎలాంటి పనులు చేపట్టారాదని సూచించారు. ఈకార్యక్రమంలో మండల గీర్దావర్ గణేష్, మండల సర్వేయర్ మణి రాజ్, అటవీ, రెవెన్యూ సిబ్బంది, దళిత రైతులు ఉన్నారు.