దళితులపై మొసలి కన్నీరు తగదు
రాష్ట్రంలో అత్యధిక భూమి కోనుగోలు చేసింది మానకొండూర్‌లోనే
బహిరంగ చర్చకు సిద్దమే
రాజకీయ లబ్దికోసమే విమర్శలు
మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి
కరీంనగర్,సెప్టెంబర్7(జనంసాక్షి): తెలంగాణా రాష్ట్రంలోని 31 జిల్లాల్లో ఏ జిల్లాలో కూడా జరుగనంత పారదర్శకంగా, ఎక్కువభూమి కొనుగోలుచేసి దళితులకు పంపిణీచేసి రికార్డు సృష్టించిన తనపై కావాలనే రాజకీయ లబ్దికోసం ప్రతిపక్షాలు బురదచల్లే ప్రయత్నం చేస్తున్నాయని మానకొండూర్ ఎమ్మెల్యే రసమయిబాలకిషన్ అన్నారు. ఓ వ్యక్తి అవేశంగా నిర్ణయం తీసుకుంటే దానిని తనకు పూసి మచ్చ తేవాలని చూస్తే ప్రజలు ఊరుకోరని పేర్కొన్నారు. కరీంనగర్ లోని ఆర్‌అండ్‌బి వసతి గృహంలో మానకొండూర్ నేతలు సిద్దంవేణు, సుగుణాకర్ రెడ్డి, అయిలయ్య, జోగిరెడ్డి, ఏకానందం తదితరులతో కలిసి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ ఇప్పటికే 910 ఎకరాల భూమిని కొనుగోలు చేసిపంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈవిషయంలో ఎక్కడికైనా చర్చకు సిద్దంగా ఉన్నానని రసమయి స్పష్టం చేశారు. గూడెంలో 3కోట్ల పైచిలుకు డబ్బులు పెట్టి 60 ఎకరాలు కొనుగోలుచేయడం జరిగిందని దీనిని కేటాయించే క్రమంలోవచ్చిన ఆరోపణలైన లంచం తీసుకునే అంశంపై కలెక్టర్‌కు ఫోన్‌చేసి విచారణ జరిపించాలని కోరానన్నారు. ఇందులో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ శ్రీనివాస్‌కు ఇప్పటికే 2 ఎకరాల స్థలం ఆయన తల్లి పోచమ్మ పేరున ఉండడంతో మిగిలిన 1 ఎకరం భూమిని కేటాయించడం జరిగిందన్నారు. ఆత్మహత్యా యత్నం చేసిన వ్యక్తిని కాపాడే క్రమంలో మాత్రమే తమ మంత్రి ఎమ్మెల్యే తదితరులు డైయింగ్ డిక్లరేషన్ తీసుకోలేదని, ముందు మనిషి ప్రాణాన్ని కాపాడాలనే తపన తమదని కాంగ్రెస్ నేతలది ప్రాణాలు తీయాలనే ఆలోచనన్నారు. మూడురోజులపాటు బాధితుడితోనే ఉండి మెరుగైన వైద్యం చేయించడం జరిగిందని పది మంది డాక్టర్ల బృందం నేడు మాంకాలి శ్రీనివాస్‌కు చికిత్స అందిస్తుందన్నారు. భూకబ్జాలకు పాల్పడింది ఆరెపల్లి మోహన్ అని ఆయన తల్లి పేరున, పెద్దకాపుల పేరున కోట్ల వ్యాపారిపేరున విలువైన భూములను సొంతం చేసుకున్నారని అన్నారు. బీదలపేరుతో వాటిని సొంత చేసుకున్న చరిత్ర ఆరెపల్లిదని అన్నారు. గూడెం గ్రామం ఎక్కడుందో కనీసం ఆరెపల్లి మోహన్‌కు తెలుసా అని ఆయన నిలదీశారు., గూడెం గ్రామంను తాను 50 సార్లు తిరిగానన్నారు. గ్రామంలో ఇద్దరికి మాత్రమే కేటాయించాల్సి ఉందన్నారు. వాస్తవాలు కావాలంటే విూడియా కూడా గ్రామాన్ని సందర్శించి తెలుసుకోవచ్చన్నారు. లంచం అడిగిన వారు ఎంతటివారైనా ఉపేక్షించేదిలేదన్నారు. లంచం ఇస్తే భూమి కేటాయించం అనే నినాదాన్ని తాను తీసుకువచ్చి అమలు చేస్తున్నానన్నారు. వీఆర్‌ఓ ప్రభుత్వ ఉద్యోగా కాబట్టే అతన్ని సస్పెండ్ చేశామని, ఎఎంసి చైర్మన్ ఎవరు అయన ఎందుకు లంచం అడుగుతాడు.. ఆయనకుఏం సంబందం అంటూ ఎమ్మెల్యే రసమయి అన్నారు. మానకొండూరులో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన శ్రీనివాస్, రాములు కోలుకుంటున్నారని ఎమ్మెల్యే రసమయి చెప్పారు. ఈ మేరకు వారి ఆరోగ్య పరిస్తితిపై ఆయన వాకబు చేశారు. కాంగ్రెస్ నేత ఆరేపల్లి మోహన్ అత్యుత్సాహం ప్రదర్శించారని రసమయి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను దళితులకు భూపంపిణీ చేస్తే.. ఆరేపల్లి భూకబ్జాలు చేశారు’ అని ఎమ్మెల్యే రసమయి ఆరోపించారు. రాష్ట్రంలో మానకొండూరు నియోజకవర్గంలోనే అత్యధికంగా భూములు కొనుగోలు చేసి, దళితులకు పంచామన్న
విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. భూములు కొనుగోలు చేయడం ఆశామాషీ విషయం కాదన్నారు. సిఎం కెసిఆర్ దళితులకు న్యాయం చేసేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. మూడెకరాల పంపిణీ కూడా అందులో భాగమన్నారు.