దళిత ఉద్దరణపై చర్చకు సిద్దమే

ఈటెలకు ఎమ్మెల్యే సంపత్‌ సవాల్‌

హైదరాబాద్‌,సెప్టెంబర్‌7(జ‌నంసాక్షి): దళిత సంక్షేమంపై బహిరంగ చర్చకు రెడీగా ఉన్నట్లు తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌కు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సంపత్‌ కుమార్‌ సవాల్‌ విసిరారు. ఆయనిక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. మంత్రి ఈటెల సవాల్‌ను స్వీకరిస్తున్నానని తెలిపారు. నిధులెన్ని కేటాయించారు.. ఎంత ఖర్చు చేశారన్న దాని పై బహిరంగ చర్చకు సిద్ధమన్నారు. ఈటెల వచ్చినా సరే.. సీఎం వచ్చినా సరే.. సమయం, ప్లేస్‌ విూరే డిసైడ్‌ చేయండి.. ప్రగతి భవన్‌ అయినా, ఫామ్‌ హౌస్‌ అయినా.. లేదంటే గన్‌ పార్క్‌ అయినా ఓకే.. నేను రెడీగా ఉన్నానని బాలకృష్ణ సినిమా తరహాలో డైలాగ్‌ విసిరారు. దళిత సంక్షేమం టీఆర్‌ఎస్‌ పాలనలో దొర గడీలో బందీ అయిందన్నారు. అంకెలతో సహా నిరూపిస్తా.. దమ్ము , దైర్యం ఉంటే.. మూడు రోజుల్లో ఈటెల టైమ్‌, ప్లేస్‌ ప్రకటించాలని సవాల్‌ విసిరారు. టీఆర్‌ఎస్‌ దళిత వ్యతిరేక పార్టీ అని.. టీఆర్‌ఎస్‌లో ఉన్న దళిత ఎమ్మెల్యేలు కేసీఆర్‌ మాటలు విని జాతికి ద్రోహం చేయవద్దని కోరారు. దళిత పౌరుషాన్ని చంపవద్దని విజ్ఞప్తి చేశారు.బహిరంగ చర్చకు తేదీని, వేదికను రెండు మూడు రోజుల్లో ప్రకటించాలని సంపత్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. దళితులకు ప్రభుత్వం చేసిందేమిటో అంకెలతో సహా నిరూపిస్తానన్నారు. తెరాసలో ఉన్న దళిత ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాటలు విని సొంత జాతికి ద్రోహం చేయొద్దని సూచించారు. తెరాస దళిత వ్యతిరేక పార్టీ అని విమర్శించారు.