దళిబంధు ఆషామాషీ కార్యక్రమం కాదు
దళితులను ఆర్థికంగా బలోపేతం చేసే యజ్ఞం
వారిని బాగుపర్చాలన్నదే కెసిఆర్ సంకల్పం
దళితబంధు యూనిట్లను పంపిణీలో మంత్రి కొప్పుల
కరీంనగర్,ఆగస్ట్26(జనంసాక్షి): దళిబంధు ఆషామాషీ కార్యక్రమం కాదని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. సిఎం కెసిఆర్ ఎంతగానో ఆలోచించి దళితులను బాగు చేయాలన్న సంకల్పంతో దీనిని తీసుకుని వచ్చారని అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో నలుగురు లబ్దిదారులకు మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ దళిత బంధు యూనిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల మాట్లాడుతూ కొన్నినెలల్లో
అన్ని దళిత కుటుంబాలకు దళిత బంధు ఇస్తామని స్పష్టం చేశారు. హుజురాబాద్‌లో దళితబంధు పథకంలో 21 వేల కుటుంబాలకు లబ్ది చేకూరిందని చెప్పారు. దళితబంధు పథకంతో దళితులు తమ కాళ్ళ విూద నిలబడతారని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. వారు ఆర్థికంగా ఎదిగి తమకాళ్లవిూద తాము నిలబడాలన్నదే సిఎం కెసిఆర్ ఆకాంక్ష అన్నారు. దళితబంధు పథకంతో త్వరలో దళితుల జీవితాల్లో మార్పు చూడబోతున్నామని మంత్రి పునరుద్ఘా టించారు. రాష్ట్రంలోని 16 లక్షల దళిత కుటుంబాలకు ఈ పథకాన్ని అమలు చేస్తామని స్పష్టంచేశారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెంచడంలో దళితబంధు పథకం దోహదపడుతుందని చెప్పారు. ఇది పేదదళిత జీవితాల్లో వెలుగులు నింపే కార్యక్రమమని, సర్వేను అధికారులు ఇష్టంతో చేయాలని కోరారు. దళితుల ఇంటికి వెళ్లి ఓపికతో, ప్రేమతో వివరాలు సేకరించాలని సూచించారు. హుజూరాబాద్ నియోజక వర్గానికి దళితబంధు కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.1500 కోట్లు కలెక్టర్ ఖాతాలో జమ చేసిందని, మరో 500 కోట్లు మూడు రోజుల్లో మంజూరుచేస్తామని వెల్లడిరచారు. మొత్తం రూ.2 వేల కోట్లతో నియోజకవర్గంలోని 21 వేల కుటుంబాలు లబ్ది పొందుతాయని స్పష్టంచేశారు. లబ్దిదారుల అభిరుచి, నైపుణ్యతకు అనుగుణంగా ఏ యూనిట్ ఎంచుకుంటారో తెలుసుకోవాలని, అవసరమైతే యూనిట్ల ఎంపికకు అధికారులు తగిన సూచనలు, సలహాలు ఇవ్వాలన్నారు. దేశంలో ఎకడాలేని విధంగా సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకంతో దళితుల జీవన ప్రమాణాలు మెరుగుపడుతాయని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. దళితబంధు సర్వే ఈ నెల 27 తేదీ నుంచి ప్రారంభించి, వారం రోజుల్లో విజయవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సర్వేతో పాటు దళిత కుటుంబాలందరికీ బ్యాంకర్లు, తెలంగాణ దళితబంధు ఖాతాను తెరవాలన్నారు. పేద, దళిత కుటుంబాల్లో వెలుగులు నింపాలనే లక్ష్యంతోనే సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టిన దళితబంధు పథకం దేశానికే గర్వకారణమని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు.