దసరా నుంచే కొత్త జిల్లాలు

C

– సీఎం కేసీఆర్‌ సమీక్ష

హైదరాబాద్‌,ఆగస్టు 9(జనంసాక్షి): కొత్త జిల్లాలు ఈ ఏడాది దసరా నుంచే మనుగడలోకి రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నతాధికారులకు నిర్దేశించారు. క్యాంపు కార్యాలయంలో ఇవాళ సీఎం కేసీఆర్‌ కొత్త జిల్లాలపై అధికారులతో సవిూక్ష నిర్వహించారు. సవిూక్ష సమావేశంలో ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ శర్మ, ఆర్థిక, రెవెన్యూ, న్యాయశాఖ అధికారులతో పాటు అడ్వకేట్‌ జనరల్‌ రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ దసరాలోగా అధికారిక ప్రక్రియలన్నింటినీ ముగించాలని ఆదేశించారు. ఈ నెల 3వ వారంలో డ్రాప్ట్‌ నోటిఫికేషన్‌ను జారీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు, సలహాలు స్వీకరించాలని అధికారులకు సూచించారు. జిల్లాల ఏర్పాటుపై ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ వర్గాల నుంచి సమాచారం సేకరించాలని నిర్దేశించారు. ఇప్పటివరకు వచ్చిన ప్రతిపాదనలపై చర్చించడానికి డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ అధ్యక్షతన కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వర్‌ రావు, జూపల్లి కృష్ణారావు, ఈటల రాజేందర్‌ సభ్యులుగా కేబినెట్‌ సబ్‌కమిటీని నియమించినట్లు తెలిపారు.రాజకీయ డిమాండ్లు పట్టించుకోకుండా ప్రజల సౌకర్యం, పరిపాలనా సౌలభ్యం తదితర అంశాలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ నెల 20 తర్వాత కొత్త జిల్లాలకు సంబంధించిన డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేయాలని సీఎం ఆదేశించారు. అధికారుల విభజన, ఆఫీసుల ఏర్పాటు వేగవంతం చేయాలని..జోనల్‌ సమస్యలు అధిగమించడానికి వ్యూహం ఖరారు చేయాలని అధికారులకు నిర్దేశించారు. కొత్త జిల్లాలో అధికార యత్రాంగం ఎలా ఉండాలి..న్యాయాధికార పరిధి ఏమేరకు ఉండాలి, అధికార వ్యవస్థ ఎలా ఉండాలన్న అంశాలపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.