దాడులకు భయపడం
ఆజాది పోరు కోనసాగుతుంది
భారతమాతఅంటే కాషాయరంగుకాదు
జెఎన్‌యూ విద్యార్ధినేత కన్హయ్య కుమార్
హైదరాబాద్,మార్చి 24 (జనంసాక్షి):
భారత్ మాతా అంటే కాషాయ రంగు కాదని… భారత్ మాతా అందరిదని జెఎన్ యూ నేత కన్హయ్యకుమార్ అన్నారు. ఈ దేశం బాబా సాహెబ్ అంబేద్కర్, భగత్ సింగ్ లది అన్నారు. హైదరాబాద్ లోని ఎస్ వికెలో రాజ్యాంగ పరిరక్షణ హక్కులపై సెమినార్ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో భేదాభిప్రాయాలు తొలగించాలనేది తన లక్ష్యమన్నారు. అంబేద్కర్ ఆశయ సాధనకు కోసం కృషి చేయాలని చెప్పారు. రాళ్లు, చెప్పులు విసిరినంత మాత్రానా ఏవిూ కాదన్నారు. పబ్లిసిటీ కోసం ఇలాంటివి జరుగుతూనే ఉంటాయన్నారు. ఇలాంటి వాటి గూర్చి భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఎవరు భయపెట్టినా భయపడేవాన్ని కాదని.. మాట్లాడుతూనే ఉంటానని చెప్పారు. ‘ఏం చేసినా భయపడే ప్రసక్తే లేదు.. నేను మాట్లాడుతూనే ఉంటానని’ చెప్పారు. దేశంలో విభేదాలు తొలగించాలనేదే తన ప్రయత్నమన్నారు. రోహిత్ చట్టం తెచ్చేవరకు పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. ఇది గాంధీ దేశం… గాడ్సే మందిరం నిర్మించడం కుదరదన్నారు. బీజేపీ ప్రభుత్వం మైనారిటీలకు వ్యతిరేకంగా పని చేస్తుందని విమర్శించారు. ఈ దేశం కులం, మతం, వర్గానికి సంబంధించింది కాదన్నారు. ఈ దేశంలో దళితులు, గిరిజనులు ఎంతోమంది పేదరికంలో మగ్గుతున్నారని చెప్పారు. దేశంలో పేదరికం నిర్మూలించాల్సిన అవసరం ఉందన్నారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం పారాడాలని పిలుపునిచ్చారు. భారత్ మాతా హమారా హై అన్నారు. తమ పోరాటం అంతా దళిత, గిరిజనుల హక్కులు కాపాడేందుకేనని చెప్పారు. మతం మసుగులో దేశాన్ని రెండుగా విభజించాలని చూస్తున్నారని ఆరోపించారు. దేశాన్ని రక్షించేందుకే తమ పోరాటం… రాజకీయ కోసం కాదని స్పష్టం చేశారు. అభివృద్ధిని ప్రజల వద్దకు తీసుకెళ్లలేక జాతీయవాదాన్ని తెరపైకి తీసుకొస్తున్నారని ఎద్దేవా చేశారు. మోడీ, ప్రభుత్వం తనకు పబ్లిసిటీ కల్పిందని చమత్కరించారు. ప్రసంగం చివర్లలో ‘మనువాది సే ఆజాదీ’… అనే పాట పాడారు.
హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్ సమావేశం రసాభాసగా మారింది. కన్హయ్య తన ప్రసంగం మొదలుపెట్టబోతుండగానే అతడి వ్యతిరేకులలో ఇద్దరు యువకులు ఒక్కసారిగా లేచి.. ‘భారత్ మాతాకీ జై’ అంటూ కన్హయ్యపై చెప్పులు విసిరారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన రాజ్యాంగ పరిరక్షణ సదస్సులో దిల్లీ జేఎన్‌యూ విద్యార్థి నేత కన్నయ్యకుమార్ పాల్గొన్నారు. కన్నయ్య ప్రసంగిస్తున్న సమయంలో అపరిచిత వ్యక్తి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ చెప్పు విసిరాడు. సదస్సులో పాల్గొన్న విద్యార్థులు అపరిచత వ్యక్తిపై దాడి చేశారు. అప్రమత్తమైన పోలీసులు అపరిచిత వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అయితే అతడిని ఏవిూ అనవద్దంటూ కన్నయ్య వారించాడు. ఈలోపు హాల్లో ఉన్న ఏఐఎస్‌ఎఫ్ విద్యార్థులు ఆ ఇద్దరినీ పట్టుకుని చితక్కొట్టారు. ఆ ఇద్దరూ విూడియా ఉన్నవైపు రావడంతో.. విూడియా కెమెరా స్టాండ్లు తీసుకుని వాటితో వాళ్లను కొట్టారు. ఈ ప్రయత్నంలో వీడియో కెమెరాలు కూడా కొన్ని పగిలాయి. వాళ్లను ఏవిూ అనొద్దని, ఊరుకొమ్మని కన్హయ్య కుమార్ చెబుతున్నా పరిస్థితి మాత్రం అదుపులోకి రాలేదు. ఈలోపు అక్కడే ఉన్న పోలీసులు వచ్చి వాళ్లిద్దరినీ బయటకు తీసుకెళ్లి అదుపులోకి తీసుకున్నారు. అయితే, కావాలనే ఈ సమావేశాన్ని రసాభాస చేయాలని కొంతమంది ప్రయత్నిస్తున్నారని ఏఐఎస్‌ఎఫ్ జాతీయ అధ్యక్షుడు ఖాద్రీ అన్నారు. దీనిపై ఆ తర్వాత ప్రసంగించిన కన్హయ్య కూడా స్పందించాడు. కొంతమంది తనను కొట్టి పబ్లిసిటీ తెచ్చుకోవాలనుకుంటున్నారని, కానీ
చెప్పులు, రాళ్లు విసిరితే ప్రయోజనం ఉండదని చెప్పాడు. ఈ రోజు తన విూద చెప్పులు విసిరిన వాళ్ల విూద గానీ, నిన్న తనను కొట్టినవాళ్ల విూద గానీ తనకు ఏమాత్రం కోపం లేదని.. వాళ్ల వల్ల తనకు మరింత మేలు జరుగుతుందని అన్నాడు. చివరకు తనను జైలుకు పంపినవారి విూద కూడా ఎలాంటి కోపం లేదని అన్నాడు. రాళ్లు, చెప్పులు విూవిూదే వేసుకుంటున్నారని రేపు విూకు అర్థం అవుతుందని తెలిపాడు. ఇదే సందర్భంలో కన్నయ్య మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాల విూద ఒక సీరియస్ దాడి జరుగుతోందని అన్నారు. . తొలుత హెచ్‌సీయూలో ఘటన జరిగిందని, తర్వాత జేఎన్‌యూలో విద్యార్థులను తప్పుపట్టారని అన్నాడు. పోనీ ఈ రెండింటినీ పక్కన పెడితే అలీగఢ్ యూనివర్సిటీ మైనారిటీ ¬దాను తప్పించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించాడు. మొత్తంగా అసలు విద్యార్థుల ఆందోళనను డీలెజిటమేట్ చేసే ప్రయత్నం ఒకటి జరుగుతోందని ఆరోపించాడు. జస్టిస్ ఫర్ రోహిత్ వేముల ఆందోళనను ఢిల్లీలో కొనసాగించాలని తాము ముందుగానే నిర్ణయించుకున్నామని, ఇక్కడ ఘటన జరిగిన తర్వాత తాను ఇక్కడికొచ్చి విద్యార్థి సంఘాల నేతలతో మాట్లాడానని తెలిపాడు.
ఇక్కడి నుంచి ఢిల్లీ వెళ్లిన తర్వాత అక్కడ జేఏసీ ప్రారంభించామని, అంబేద్కర్ భవన్ నుంచి ఆర్‌ఎస్‌ఎస్ ఆఫీసు వరకు నిరసన ప్రదర్శన నిర్వహించామని, తర్వాత బహిరంగ సభ కూడా నిర్వహించామని తెలిపాడు. రోహిత్ వేముల ఆందోళనకు జేఎన్‌యూలో జరిగిన ఆందోళన కేవలం ఒక కొనసాగింపు మాత్రమేనని వెల్లడించాడు. అయితే ప్రభుత్వం మాత్రం ఈ రెండింటినీ ఒక దానికి ఒకటి పోటీగా చేయాలనుకుందని అన్నాడు. తాను జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా.. తనకు ఆదర్శప్రాయుడు అఫ్జల్ గురు కాదు, రోహిత్ వేములేనని చెప్పానని గుర్తుచేశాడు. తాను హెచ్‌సీయూకు రావాలని ముందుగానే నిర్ణయించుకున్నామని, కానీ అనుకోకుండా జరిగిందో.. కావాలనే చేశారో గానీ తాను రావడానికి ఒక్కరోజు ముందే అప్పారావు మళ్లీ వీసీగా బాధ్యతలు స్వీకరించారని కన్హయ్యకుమార్ అన్నాడు. ఆయన మద్దతుదారులు దండలతో ఆయనకు స్వాగతం పలికారని, తర్వాత శాంతియుతంగా ప్రదర్శన చేస్తున్న విద్యార్థులను రెచ్చగొట్టడంతో హింసాత్మక ఘటనలు జరిగాయని తెలిపాడు. తనకు ప్రజాస్వామ్యంపై నమ్మకముందని, హింసను ఎట్టి పరిస్థితుల్లో సమర్థించబోనని అన్నాడు. కానీ ఇక్కడ మాత్రం అమ్మాయిలను మగ పోలీసులతో కొట్టించారని, విద్యుత్, వైఫై కట్ చేశారని, చివరకు అధ్యాపకులను కూడా కొట్టి, అరెస్టుచేసి జైళ్లలో పెట్టారని చెప్పాడు. పోలీసులు తొలుత తనను యూనివర్సిటీలోకి అనుమతించాలనే అనుకున్నారట గానీ.. తర్వాత అంతర్గత భద్రతా సమస్యల వల్ల పంపలేదని చెప్పారని.. ఆ అంతర్గత భద్రతను భంగపరిచింది ఎవరని ప్రశ్నించాడు. జేఎన్‌యూ – హెచ్‌సీయూలలో ఒకేలాంటి పోలికలు కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించాడు. వీసీ అప్పారావు వల్లే హెచ్‌సీయూలో సమస్యలు వచ్చాయని కన్నయ్య ఆరోపించారు. వర్సిటీ క్యాంపస్‌లను వార్ జోన్‌లుగా మార్చారని ఆయన విమర్శించారు. జేఎన్‌యూ, హెచ్‌సీయూలో జరుగుతున్న ఆందోళనలను కేంద్రం పరస్పర విరుద్ధంగా ఉపయోగించే ప్రయత్నం చేసిందన్నారు. ఈ కర్యాక్రమంలో విద్యార్థులు, పలువురు సిపిఐ, వామపక్ష నేతలు హాజరయ్యారు.




