దాణా కుంభకోణంలో లాలూకు మరోషాక్‌

– మూడోకేసులోనూ లాలూ దోషిగా ప్రకటించిన సీబీఐ ప్రత్యేకోర్టు
– నేడు శిక్షలు ఖరారు చేయనున్న న్యాయస్థానం
రాంచీ, జనవరి24(జ‌నంసాక్షి) : ఆర్జేడీ అధినేత, బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కు మరో షాక్‌ తగిలింది.  దాణా కుంభకోణానికి సంబంధించిన మూడో కేసులోనూ లాలూను దోషిగా తేలారు. ఈ కేసులో లాలూ, జగన్నాథ మిశ్రా నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో వీరు దోషులేనని రాంచీలోని సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి ఎస్‌ఎస్‌.ప్రసాద్‌ బుధవారం తీర్పు చెప్పారు. శిక్ష మాత్రం ఇంకా ఖరారు చేయలేదు. ఇప్పటికే లాలూ ప్రసాద్‌ యాదవ్‌ దాణా కుంభకోణం రెండో కేసులో మూడున్నరేళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ప్రస్తుతం ఆయన బిర్సా ముండా కేంద్ర కారాగారంలో ఉన్నారు. మూడో దాణా కుంభకోణం కేసులో ఛాయ్‌బసా ఖజానా నుంచి రూ.36కోట్లు అక్రమంగా పొందినట్లు లాలూ, మిశ్రాపై కేసు ఉంది. లాలూపై మొత్తం ఐదు దాణా కుంభకోణం కేసులు ఉన్నాయి. 2013లో మొదటి దాణా కుంభకోణం కేసులో లాలూ అయిదేళ్ల జైలు శిక్ష పడింది. మరో కేసులో ఈనెల 6న లాలూకి మూడున్నరేళ్ల జైలు శిక్షను విధిస్తూ సీబీఐ న్యాయస్థానం తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఆయనపై ఇంకా దమ్‌కా ఖజానా నుంచి రూ.3.97కోట్లు, దొరాండా ఖజానా ద్వారా రూ.184కోట్లు అక్రమంగా పొందినట్లు కేసులు ఉన్నాయి. వీటికి సంబంధించిన తీర్పులు త్వరలోనే వెలువడే అవకాశాలున్నాయి.