దారి దోపిడీ ముఠా అరెస్టు
నెల్లూరు, జూలై 5 : దారిదోపిడీకి పాల్పడిన నలుగురి సభ్యుల గల ముఠాను నెల్లూరు పోలీసులు కేవలం 10 గంటల్లో అరెస్టు చేసి తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ మేరకు బుధవారం రాత్రి జిల్లా ఎస్పీ బి.వి రమణకుమార్ విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. నిందితుల నుంచి మూడు బైకులు, 6 లక్షల 44 వేల రూపాయల విలువ చేసే నగలు, నాలుగు సెల్ ఫోన్లు సీజ్ చేసినట్లు రమణకుమార్ వెల్లడించారు. వివరాలలోకి వెళ్లితే నెల్లూరు నగరంలోని పప్పుల వీధి ó ప్రాంతంలో శ్రీరామ వెంకటేశ్వర్లు అనే వ్యక్తి పద్మావతి ట్రేడర్స్ ద్వారా పప్పుల వ్యాపారం చేస్తున్నారు. పొరుగనే ఉన్న చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి, రేణిగుంట ప్రాంతాల్లో వ్యాపారం చేస్తుండేవారు వెంకటేశ్వర్లు వద్ద స్టోన్‌హౌస్‌పేట ప్రాంతానికి చెందిన కోటేశ్వరరావు అనే వ్యక్తి గుమస్తాగా పని చేస్తున్నారు. ఈయనకు సొంత ఆటో కూడా ఉంది. ఈ ఆటోలోనే సరుకులను ఇతర ప్రాంతాలకు తరలించడం, షాపుల నుంచి వచ్చి డబ్బును తిరిగి యజమానికి చేర్చడం చేస్తుండేవారు. ఇతని వద్ద పి. కార్తీక్ (21) ఆటో డ్రైవర్‌గా పని చేస్తుండేవారు ఈ నేపథ్యంలో మంగళవారంనాడు కోటేశ్వరరావు ఆటోలో కంది పప్పును చిత్తూరు జిల్లాలోని రేణిగంటలోగల వినాయకట్రేడర్స్‌్‌కు రవాణా చేశారు. వారి వద్ద నుంచి 6 లక్షల 78 వేలు నగదును తీసుకుని నెల్లూరుకు ప్రయాణం అయ్యారు. బుధవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ఓజిల్ వద్ద ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు మారణాయుధాలతో అడ్డగించి కోటేశ్వరారవు వద్దను రూ. 6 లక్షల 78 వేలు దోచుకువెళ్లారు. వెంటనే ఈ విషయాన్ని కోటేశ్వరరావు తన యజమాని అయిన వెంకటేశ్వర్లకు తెలపగా ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. గూడూరు డీస్పీ సురేష్‌కుమార్ రంగంలోకి దిగి ముందుగా గుమస్తా కోటేశ్వరరావును, అటు తర్వాత కార్తీక్‌ను వేర్వేరుగా విచారించారు. ఈక్రమంలో దోపిడీకి పాల్పడ్డ ముగ్గురు వ్యక్తులు తాను ఏర్పాటు చేసిన మనుషులేనని ఆటో డ్రైవర్ కార్తీక్ పోలీసు విచారణలో వెల్లడించడతో అసులు విషయం బయటపడింది. దీంతో బుధవారం సాయంత్రం 8 గంటల ప్రాంతంలో కార్తీక్ వెల్లడించిన వివరాల ప్రకారం ఎస్. వెంకటరత్నం (32), బి. సుబ్రహ్మణ్యం (20), ఎం. కోటేశ్వరరావు (25) పోలీసులు అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 6 లక్షల 44 వేల 570 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 6 లక్షల 78 వేల సొత్తును దొంగతనం చేయగా అందులో 30 వేల రూపాయలు రోడ్డు మీదనే పడిపోయాయని నిందితులు వెల్లడించారు. కేవలం 10 గంటలలోపు నిందితులను అరెస్టు చేసిన డిఎస్పీ సురేశ్‌కుమార్‌ను, ఆయన సిబ్బందిని జిల్లా ఎస్పీ బి.వి రమణకుమార్ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జాతీయ రహదారిపై ఇటీవల పెరిగిపోతున్న దోపిడీలను దృష్టిలో పెట్టుకుని ఇక నుంచి మూడు ముబైల్ పార్టీలను నెల్లూరు, కావలి, గూడూరు ప్రాంతాల్లో నియమించనున్నట్లు ఎస్పీ వెల్లడించారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ చంద్రశేఖర్ తదితరలు పాల్గొన్నారు.