దావూదు ఆస్తులపై సుప్రీం కీలక తీర్పు

ముంబై ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వానికి ఆదేశం
న్యూఢిల్లీ,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): అండర్‌వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహింకు చెందిన ముంబయి ఆస్తులను వెంటనే జప్తు చేయాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ఆస్తుల స్వాధీనంపై దావూద్‌ తల్లి అమినా బీ కస్కర్‌, సోదరి హసీనా పార్కర్‌ వేసిన పిటిషన్లను న్యాయస్థానం తిరస్కరించింది. ఆ ఆస్తులు దావూద్‌కు చెందినవేనని, వాటిని జప్తు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆ ఇద్దరూ చనిపోయారు.
ముంబయిలోని నాగ్‌పడాలో దావూద్‌కు చెందిన కొన్ని ఆస్తులను ఆయన తల్లి, సోదరి తమ పేర్లపై బదలాయించుకున్నారు. వీరిద్దరి పేర్లపై ఏడు రెసిడెన్షియల్‌ ఆస్తులు(రెండు అవిూనా పేరుపై, ఐదు హసీనా పేరుపై) ఉన్నాయి.  అయితే 1988లో సఫెమా(స్మగ్లర్స్‌ అండ్‌ ఫారిన్‌ ఎక్స్ఛేంజ్‌ మానిప్యేలేటర్స్‌ ఫోర్‌ఫీచర్‌ ఆఫ్‌ ప్రాపర్టీస్‌) చట్టం కింద.. ఈ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఈ జప్తును సవాల్‌ చేస్తూ  దావూద్‌ తల్లి, సోదరి దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్లను హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో 1998లో వీరు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. అయితే ఆస్తులకు సంబంధించిన ప్రతాలను చూపించాలని అవిూనా, హసీనాకు పలు సార్లు అవకాశాలిచ్చామని ప్రభుత్వం చెబుతోంది. వారివద్ద ఎలాంటి పత్రాలు లేవని పేర్కొంది. ఈ నేపథ్యంలో విచారణ పూర్తిచేసిన సర్వోన్నత న్యాయస్థానం హసీనా, అవిూనా పిటిషన్లను కొట్టివేసింది. 1993 ముంబయి వరుస పేలుళ్ల ఘటనలో కీలక సూత్రధారి అయిన దావూద్‌ ఇబ్రహిం చాలా ఏళ్లుగా అజ్ఞాతంలో ఉంటున్నాడు. ఆయన పాక్‌లోని కరాచీలో ఉంటున్నట్లు భారత్‌ పదేపదే చెబుతున్నప్పటికీ పాకిస్థాన్‌ మాత్రం
దీన్ని అంగీకరించట్లేదు. ఇటీవల ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి కూడా దావూద్‌ పాక్‌లోనే ఉన్నట్లు పేర్కొంది.