దిగి వచ్చిన కేంద్రం, నేడు రైతు సంఘాలతో భేటీ
న్యూఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో గత ఐదు రోజులుగా ఆందోళన కొనసాగిస్తున్న రైతు సంఘాల నేతలను కేంద్ర ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. మంగళవారం తమతో చర్చలకు ముందుకు రావాలని కోరింది. ఈ విషయాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సోమవారం రాత్రి ప్రకటించారు. రైతు సంఘాలు పోరాటం ఇక్కడితో ఆపాలని, చర్చలతోనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని స్పష్టం చేశారు.
వాస్తవానికి డిసెంబర్ 3న రైతు సంఘాల నాయకులతో సంప్రదింపులు జరపాలని ప్రభుత్వం భావించింది. అయితే, ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసులు నానాటికీ పెరుగుతుండడం, చలి సైతం తీవ్రమవుతుండడంతో రెండు రోజుల ముందే చర్చలు సాగించాలని కేంద్రం నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఇప్పటికే రెండు సార్లు.. అక్టోబర్ 14, నవంబర్ 13న రైతులతో చర్చించింది. మంగళవారం(డిసెంబర్ 1) మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో మూడో దఫా చర్చలు జరగనున్నాయి. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్‌పై రైతులు, రైతు సంఘాలు వెనక్కి తగ్గడం లేదు.
సాగు చట్టాలు కరోనా కంటే ప్రమాదం
కరోనా›హెచ్చరికలను సైతం లెక్కచేయకుండా అన్నదాతలు నిరసన సాగిస్తున్నారు. ప్రభుత్వం దిగివచ్చేదాకా ఆందోళన విరమించే ప్రసక్తే లేదని తేల్చిచెబుతున్నారు. కరోనాతో ముప్పు ఉంటుందన్న విషయం తమకు తెలుసని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వ కొత్త వ్యవసాయ చట్టాలు కరోనా కంటే మరింత ప్రమాదకరమని పేర్కొంటున్నారు. ధర్నాలో ఉన్న రైతులకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేసేందుకు ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మహమ్మారిపై విస్తృతంగా ప్రచారం చేస్తోంది. ఏడుగురు వైద్యులతో కూడిన బృందం నవంబర్ 28 నుంచి 90 మంది రైతులకు పరీక్షలు చేసింది. వీరిలో ఎవరికీ కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాలేదని డాక్టర్లు చెప్పారు.
షరతులు పెడితే.. ఢిల్లీని ముట్టడిస్తాం
సాక్షి, న్యూఢిల్లీ: చర్చల విషయం లో కేంద్రం ఎలాంటి షరతులు విధించరాదని రైతులు పేర్కొన్నారు. అవసరమైతే ఢిల్లీని దిగ్బంధిస్తామని హెచ్చరించారు. నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన చలో ఢిల్లీ సోమవారం ఐదో రోజుకు చేరుకుంది. చలిని సైతం లెక్కచేయకుండా సింఘు, టిక్రీ రహదారులపై బైఠాయించి రైతులు నిరసన తెలుపుతున్నారు. రైతుల ఆందోళనకు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మద్దతు తెలిపారు.
యూనియన్ల మద్దతు..
నిరసన తెలుపుతున్న రైతులకు అఖిల భారత వ్యవసాయ కార్మికుల సంఘం (ఏఐఏడబ్ల్యూయూ) ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, సెంటర్ ఫర్ ఇండియన్ ట్రేడ్ యూనియన్లు (సీఐటీయూ) సంయుక్త కార్యదర్శి విక్రమ్ సింగ్, అధ్యక్షురాలు కె.హేమలత, సీఐటీయూ కార్యదర్శి కరుమలియన్‌లు మద్దతు తెలిపారు. రైతుల పోరాటాన్ని దేశవ్యాప్తంగా తీవ్రతరం చేయాలని ఏఐఏడబ్ల్యూయూ నిర్ణయించింది. ఈ మేరకు తక్షణ కార్యాచరణ ప్రకటించింది.