దిగువకు నీరు..పారాహుషార్
– పుష్కరాలపై సీఎం కేసీఆర్ సమీక్ష
హైదరాబాద్, జులై23(జనంసాక్షి):ప్రాజెక్టుల నుంచి మళ్లీ నీరు దిగువకు నీరు విడుదలైనందున గోదావరిలో ప్రవాహ ఉధృతి కొంచెం ఎక్కువగా ఉంటుందని అందుకే భక్తులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. గోదావరి పుష్కరాల చివరి రెండు రోజులు అధికారులు జాగ్రత్తగా ఉండాలని సీఎం కె. చంద్రశేఖర్‌రావు సూచించారు. ఇప్పటి వరకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించారని, చివరి రెండు రోజులు కూడా అదే స్ఫూర్తితో పనిచేయాలని కోరారు.ఈ మేరకు ఆయన గురువారం అధికారులతో సవిూక్ష జరిపారు. క్యాంపు కార్యాలయంలో జరిపిన సమావేశంలో డీజీపీ అనురాగ్‌శర్మ, సీఎస్ రాజీశర్మతోపాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. శుక్ర, శనివారం పుష్కరాల చివరి రెండు రోజులు కాబట్టి భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సీఎం తెలిపారు. అందుకు తగినట్టుగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. పుష్కర ఘాట్ల వద్ద, దేవాలయాల వద్ద భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కనుక క్రమబద్దీకరణపై ఎక్కువ దృష్టి పెట్టాలన్నారు. భక్తులు నిర్దేశిత పుష్కరఘాట్లలో, నీటి ప్రవాహం తక్కువగా ఉండే ఒడ్డు ప్రాంతంలో స్నానాలు చేయాలని సూచించారు. మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు పోలీసు, ఇతర శాఖల అధికారులతో కలిసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చూడాలన్నారు. చివరి రెండు రోజులు కూడా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితులు తలెత్తినా వెంటనే స్పందించే విధంగా యంత్రాంగం సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. ఇదిలావుంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న గోదావరి పుష్కరాలు విజయవంతంగా కొనసాగుతోన్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తోన్నారు. పుష్కరాల్లో నేటి వరకు 4.62 కోట్ల మంది పుణ్య స్నానాలు చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. నిజామాబాద్‌లో 1.32 కోట్లు, ఆదిలాబాద్‌లో 50 లక్షలు, కరీంనగర్‌లో 2.19 కోట్లు, వరంగల్‌లో 15 లక్షలు, ఖమ్మం జిల్లాలో 45 లక్షల మంది పుష్కర స్నానాలు చేశారు. కాగా, పొరుగు రాష్ట్రం ఆంధప్రదేశ్‌లోని ఉభయగోదావరి జిల్లాల్లో ఉన్న పుష్కర ఘాట్లలో నేటి వరకు 3.81 కోట్ల మంది పుష్కర స్నానాలు చేశారు.