దిలీప్‌కు హైకోర్టులో మళ్లీ చుక్కెదురు

కేరళ: ప్రముఖ మలయాళ నటుడు దిలీప్‌కు హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది. ఆయన బెయిల్‌ కోరుతూ రెండోసారి చేసుకున్న దరఖాస్తును కోర్టు తిరస్కరించింది. దిలీప్‌ బెయిల్‌ కోసం మొదటిసారి చేసుకున్న దరఖాస్తును జులై 24న హైకోర్టు పరిశీలించింది. దిలీప్‌ బయటికి వస్తే పలుకుబడి ఉపయోగించి కేసు ఆధారాలను తప్పుదోవ పట్టించే అవకాశం ఉందన్న వాదన విన్న తర్వాత.. అప్పుడు బెయిలు మంజూరుకు నిరాకరించింది. కాగా తాను అమాయకుడ్ని అంటూ మళ్లీ ఆయన రెండోసారి బెయిల్‌కు దరఖాస్తు చేశారు. దీన్ని తాజాగా పరిశీలించిన కోర్టు ఆయన వినతిని మరోసారి తిరస్కరించింది.

ప్రముఖ మలయాళ నటి కారును అడ్డగించి లైంగికంగా వేధించి, సెల్‌ఫోన్లో చిత్రీకరించారు. ఫిబ్రవరిలో జరిగిన ఈ సంఘటనదక్షిణ చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించింది. ఈ కేసుతో సంబంధం ఉన్న ఆరోపణలపై జులై 10న పోలీసులు దిలీప్‌ను అరెస్టు చేశారు. ఏడు వారాలుగా ఆయన అలువా సబ్‌ జైలులోనే ఉన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు పల్సర్‌ సునిని, అతడి అనుచరులను పోలీసులు అరెస్టు చేసి, విచారిస్తున్నారు.