దిల్లీపై కరోనా పంజా
ఒక్క రోజే 104 మంది బలి
వాయు కాలుష్యమే కరోనా విజంభణ
పదిరోజుల్లో పరిస్థితిని అదుపులోకి తెస్తాం
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజీవ్రాల్
న్యూఢిల్లీ, నవంబర్13((జనంసాక్షి) ): దేశ రాజధానిలో ఒక్కరోజే 104 మంది వైరస్ వల్ల మత్యువాత పడ్డారు. 24 గంటల్లో ఇంత భారీ సంఖ్యలో మరణాలు చోటుచేసుకోవడం ఐదు నెలల్లో ఇదే తొలిసారి కావడం గమనార్హం. దీంతో దేశ రాజధానిలో ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 7,332కు పెరిగింది. నిన్న ఒక్కరోజే 7,053 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4.67లక్షలు దాటింది.
గత కొన్ని రోజులుగా దిల్లీని చలి తీవ్రంగా వణికిస్తోంది. దీనికి తోడు కాలుష్యం కూడా ప్రమాదకర స్థాయికి చేరింది. దీంతో కొవిడ్ బాధితుల సంఖ్య నానాటికీ పెరుగుతోందని ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. అక్టోబరు 18 నుంచి అక్కడ కేసులు ఒక్కసారిగా పెరుగుతూ వస్తున్నాయి. గురువారం 60,229 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. 7,053 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అయితే బుధవారంతో పోలిస్తే కేసుల సంఖ్య కాస్త తక్కువగా ఉండటం ఊరటనిచ్చింది. బుధవారం దేశ రాజధానిలో రికార్డు స్థాయిలో 8,593 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 85 మంది మరణించారు.
కాగా.. ఇప్పటివరకు దిల్లీలో 89శాతం మంది కరోనా నుంచి కోలుకున్నారు. గురువారం నాటికి 43,116 క్రియాశీల వైరస్ కేసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. కేసుల తీవ్రతతో రాజధానిలో కంటోన్మెంట్ జోన్లను కూడా పెంచారు. ప్రస్తుతం అక్కడ 4,141 కంటోన్మెంట్ జోన్లు ఉన్నాయి. ఇదిలావుంటే
దేశ రాజధానిలో కోవిడ్ ఇన్‌ఫెక్షన్ కేసుల పెరుగుదలకు కాలుష్యమే కారణమని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజీవ్రాల్ ఆరోపించారు. రాబోయే 7 నుంచి 10 రోజుల్లో వైరస్ వ్యాప్తిని అదుపులోకి తెస్తామన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. కేసుల పెరుగుదలకు అతిపెద్ద కారణం కాలుష్యమేనని, ఢిల్లీలో కరోనా కేసులు పెరగక్కుండా నిరోధించినప్పటికీ కాలుష్యం పెరగడం మొదలైన తర్వాత కోవిడ్ కేసులు కూడా పెరిగాయని ఒక బహిరంగ ప్రకటనలో తెలిపారు. అక్టోబర్ 20 నాటికల్లా పరిస్థితి అదుపులోకి తెస్తామని చెప్పారు. ‘గత కొద్ది రోజులుగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. అదుపు చేయడానికి అన్ని చర్యలూ తీసుకున్నాం. వచ్చే వారంలో మరిన్ని చర్యలు తీసుకుంటాం. నా ఉద్దేశం ప్రకారం వారం నుంచి పది రోజుల్లో పరిస్థితి అదుపులోకి వస్తుంది. కేసులు తగ్గడం మొదలవుతుంది’ అని కేజీవ్రాల్ చెప్పారు. ఢిల్లీలో రికార్డు స్థాయిలో మంగళవారం 104 మరణాలు సంభవించడం, మతుల సంఖ్య 7,332కు చేరిన
నేపథ్యంలో కేజీవ్రాల్ తాజా వ్యాఖ్యలు చేశారు. దేశ రాజధానిలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4.67 లక్షలకు చేరింది. బుధవారంనాడు 8,593 కరోనా కేసులు నమోదు కాగా, 85 మంది మత్యువాత పడ్డారు.