దిల్లీ కాలుష్యం.. ఈ గన్నుతో దూరం

ఢిల్లీ అనగానే ఠక్కున గుర్తుకొచ్చేది రాజధాని మాత్రమే కాదు.. పొల్యూషన్ కూడా. నేరుగా ముక్కులతో గాలి పీల్చుకోవటం అనేది చాలా డేంజర్. అందుకే అందరూ మాస్క్ లు పెట్టుకుని తిరుగుతుంటారు. ఇంట్లో ఉన్నప్పుడు సరే.. బయటకు వెళ్లకుండా ఉండలేం. బయటకు వస్తే చాలు ఎక్కడ చూసినా కాలుష్యమే. గాల్లోని కాలుష్యాన్ని తరిమికొట్టేందుకు సరికొత్త యంత్రాలను వీధుల్లోకి తీసుకొస్తోంది ఢిల్లీ ప్రభుత్వం.

కాలుష్య నివారణకు యాంటీ స్మాగ్‌ గన్‌  అనే పరికరాన్ని పరీక్షించింది. ఢిల్లీ సెక్రటేరియట్‌లో డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా, పర్యావరణ శాఖ మంత్రి ఇమ్రాన్‌ హుస్సేన్‌ల ఆధ్వర్యంలో ఈ పరికరానికి పరీక్షలు నిర్వహించారు. క్లౌడ్‌ టెక్‌ సంస్థకు చెందిన ఈ పరికరం ఎరుపు రంగులో డ్రమ్ము ఆకారంలో ఉంటుంది. వాటర్‌ ట్యాంక్‌కు అనుసంధానం చేశారు. ఈ పెద్ద గన్ తో గాల్లోకి నీటి తుంపర్లను పంపిస్తారు. అవి 30 అడుగుల ఎత్తు వరకు వెళ్లి.. గాల్లోని దుమ్ము, ధూళిని కిందకు తీసుకొస్తుంది. పొగమంచులోని కాలుష్యాన్ని ఈ నీరు కిందకి దించుతుంది. ఈ పరికరంతో 50 మీటర్లపైనే నీటి జల్లులను కురిపిస్తుంది. యాంటీ స్మాగ్‌ గన్నును అత్యధిక కాలుష్యం ఉన్న ఆనంద్‌ విహార్‌ ప్రాంతంలో ఇవాళ ఉపయోగించారు.

కాలుష్యం, పొగమంచు కారణంగా ‘గ్యాస్‌ ఛాంబర్‌’గా మారిన దిల్లీలో ఇటీవల జరిగిన భారత్‌-శ్రీలంక మ్యాచ్‌కు కూడా ఆటంకం కలిగింది. గాలిని పీల్చలేక కొందరు క్రికెటర్లు ఏకంగా మైదానంలోనే వాంతులు చేసుకున్నారు. వెంటనే తగిన చర్యలు తీసుకోకపోతే కాలుష్యం తీవ్రత పెరిగిపోయి ప్రజలు తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారని పలువురు వైద్యులు హెచ్చరించారు. దాంతో దిల్లీ ప్రభుత్వం కాలుష్యాన్నినివారించేందుకు ఈ పరికరాన్ని ప్రయోగించనుంది. ఒక్కో గన్ ఖరీదు రూ.50లక్షలు. సత్ఫలితాలను ఇస్తే మాత్రం.. ఇలాంటి పరికరాలను అత్యధిక కాలుష్యం ఉన్న ప్రాంతాల్లో రోజువారీగా ఉపయోగించటానికి ప్రణాళిక సిద్ధం చేస్తోంది క్రేజీవాల్ సర్కార్.