దిల్లీ 9వ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణం
భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య వైభవంగా లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె.సక్సేనా ప్రమాణం చేయించారు.
దిల్లీ: అభిమానులు, పార్టీ కార్యకర్తల సంబరాలు, కేరింతల మధ్య దేశ రాజధాని దిల్లీలో భాజపా ప్రభుత్వం కొలువుదీరింది. గురువారం మధ్యాహ్నం రామ్‌లీలా మైదానంలో భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య వైభవంగా నిర్వహించిన కార్యక్రమంలో దిల్లీ 9వ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణం చేశారు. అదే వేదికపై మంత్రులుగా మరో ఆరుగురితోనూ లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె.సక్సేనా ప్రమాణం చేయించారు. ప్రధాని మోదీ, రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, జె.పి.నడ్డా సహా పలువురు కేంద్ర మంత్రులు, ఎన్డీయే పాలిత రాష్ట్రాల సీఎంలు, భాజపా అగ్రనేతలు, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తదితరులు హాజరయ్యారు. 26 ఏళ్ల తర్వాత దిల్లీలో అధికారాన్ని దక్కించుకోవడంతో భాజపా శ్రేణుల్లో ఆనందోత్సాహాలు పెల్లుబికాయి. వేలాదిగా కార్యక్రమానికి తరలివచ్చారు. మంత్రివర్గ తొలి కూర్పులో వివిధ సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించారు. మంత్రులుగా ప్రమాణం చేసిన వారిలో పర్వేశ్ వర్మ, కపిల్ మిశ్రా, మంజిందర్ సింగ్ సిర్సా, ఆశీశ్ సూద్, రవీందర్ ఇంద్రజ్ సింగ్, పంకజ్ సింగ్ ఉన్నారు. రేఖా గుప్తాకు కేంద్ర ప్రభుత్వం జెడ్ కేటగిరీ భద్రత కల్పించింది.