దివంగత ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి ఉభయసభల నివాళి

5

హైదరాబాద్‌ ,సెప్టెంబర్‌23(జనంసాక్షి):

మెదక్‌ జిల్లా నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే, దివంగత కిష్టారెడ్డి మృతికి తెలంగాణ శాసనసభ,మండలి  నివాళి అర్పించింది. ఆయన సేవలను గుర్తుచేసుకుని తమకున్న అనుబంధాన్ని చాటుకున్నారు. గుండెపోటుతో ఇటీవల మృతిచెందిన మెదక్‌ జిల్లా నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే పటోళ్ల కిష్టారెడ్డి మృతి పట్ల ఉభయసభలు నివాళి అర్పించాయి. రెండు నిముషాలు మౌనం పాటించిన అనంతరం సభలు వాయిదా పడ్డాయి. కిష్టారెడ్డి చాలా కలుపుగోలు వ్యక్తి అని సీఎం కేసీఆర్‌ అన్నారు.  కిష్టారెడ్డి మృతి పట్ల సభలో సిఎం కెసిఆర్‌ సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. అందరితో కలుపుగోలుగా మాట్లాడే వ్యక్తి కిష్టారెడ్డి. ఆయనతో నాకు 40 ఏళ్ల అనుబంధం ఉంది. కిష్టారెడ్డి మృతి బాధాకరం. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతాపం ప్రకటించారు. ఆయన మృతికి సంతాపంగా శాసనసభలో ఆయన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆయన మృతి నియోజకవర్గ ప్రజలతో పాటు వ్యక్తిగతంగా తనకు తీరని లోటని అన్నారు. ఈ సందర్భంగా కిష్టారెడ్డి కుటుంబసభ్యులకు తన ప్రగాడ సానుభూతిని తెలిపారు. శాసనసభ స్పీకర్‌ మధుసూదనాచారి తీవ్ర సంతాపం ప్రకటించారు. కిష్టారెడ్డి లాంటి రాజకీయ అనుభవజ్ఞుడిని కోల్పోవడం రాష్ట్రానికి తీరని లోటని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. స్పీకర్‌ సందేశం అనంతరం శాసనసభలో రెండు నిమిషాలు మౌనం పాటించారు.ఎమ్మెల్యే కిష్టారెడ్డి అకాల మృతి రాష్ట్రానికి, కాంగ్రెస్‌ పార్టీకి తీరని లోటని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే డీకే అరుణ అన్నారు. కిష్టారెడ్డి లాంటి అనుభవజ్ఞుడు సభలో లేకపోవడం వెలితిగా ఉందన్నారు. కిష్టారెడ్డికి నివాళిగా నారాయణఖేడ్‌ ఉపఎన్నికను ఏకగ్రీవం చేయాలని ఆమె సభాముఖంగా ప్రభుత్వాన్ని, ఇతర పార్టీలను కోరారు. నారాయణఖేడ్‌ ఎమ్మెల్యేకిష్టారెడ్డితో తనకు అవినాభావ సంబంధం ఉందని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే గీతారెడ్డి అన్నారు. తాను రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో కిష్టారెడ్డి ఎన్నో సలహాలు ఇచ్చేవారని తెలిపారు. ఆయన మరణం రాష్ట్రానికి, కాంగ్రెస్‌ పార్టీకే గాక.. వ్యక్తిగతంగా తనకు తీరని లోటన్నారు. కిష్టారెడ్డికి నివాళిగా నారాయణఖేడ్‌ ఉప ఎన్నికను ఏకగ్రీవం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగిన వ్యక్తి కిష్టారెడ్డి అని తెలంగాణ కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నేత జానారెడ్డి శాసనసభలో అన్నారు. కిష్టారెడ్డి హఠాన్మరణం చాలా బాధకు గురి చేసిందన్నారు. కిష్టారెడ్డి పీఏసీకి వన్నె తెచ్చిన గొప్ప వ్యక్తి అని భాజపా శాసనసభాపక్ష నేత డా.లక్ష్మణ్‌ అన్నారు. కిష్టారెడ్డి కాంగ్రెస్‌ సభ్యుడైనా… రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం తపించేవారని కొనియాడారు. మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. కిష్టారెడ్డి తన నియోజకవర్గ అభివృద్ధికి కోసం ఎనలేని కృషి చేశారు. ప్రజా సమస్యలపై ఆయన మంచి సలహాలు ఇచ్చేవారని తెలిపారు. బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్‌ సంతాపాన్ని తెలుపుతూ.. కిష్టారెడ్డి లేని లోటు సభలో కనబడుతోంది. తెలంగాణలోనే సీనియర్‌ రాజకీయ నాయకుడు ఆయన. సర్పంచ్‌గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి కిష్టారెడ్డి అని వెల్లడించారు. పార్టీలకతీతంగా వ్యవహరించే వ్యక్తి కిష్టారెడ్డి అని పాషా ఖాద్రీ అన్నారు.  కిష్టారెడ్డి జీవితం అందరికీ ఆదర్శప్రాయం అన్నారు.  సౌముడ్యు, వివాదరహితుడు. కిష్టారెడ్డి ప్రజాప్రతినిధియే కాదు.. రైతు కూడా. పార్టీ ఆత్మీయున్ని కోల్పోయిందని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు చిన్నారెడ్డి, జీవన్‌రెడ్డిలు అన్నారు. మంత్రి హరీశ్‌రావు,  ఎర్రబెల్లి దయాకర్‌రావు, వైకాపా, వామపక్ష పార్టీల సభ్యులు కిష్టారెడ్డి మృతి పట్ల సంతాపం ప్రకటించారు. కిష్టారెడ్డికి నివాళిగా నారాయణఖేడ్‌ ఉప ఎన్నికల్లో ఆయన కుటుంబసభ్యులను నిలబెట్టి ఏకగ్రీవం చేయాలని కాంగ్రెస్‌ సభ్యులు కోరారు.