దిశనిర్దేశం లోపించిన పునాది
ఖమ్మం, జూలై 10 : గిరిజన సంక్షేమ శాఖలో విద్యార్థుల నైపుణాల అభివృద్ధికి ప్రవేశపెట్టిన పునాది కార్యక్రమం అమలులో దిశనిర్దేశం లోపించాయని ఎపిటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు రామాచారి ఆరోపించారు. గత సంవత్సరం చివరి దశలో ఒకపూట బడుల సమయంలో పునాది కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం వల్ల లక్ష్యం నెరవేరలేదని విమర్శించారు. ఈ విద్యా సంవత్సరం పునాది విధివిధానాల క్యాలెండర్ విడుదల చేయకపోవడం, ఐఆర్‌జిలుగా వెళ్లిన ఉపాధ్యాయుల స్థానంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడం వల్ల పాఠశాల విద్యార్థులు పాఠశాలకు దూరమయ్యే ప్రమాదం నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పునాది కార్యక్రమంతో ఉపాధ్యాయులు గందరగోళానికి గురవుతున్నారని అన్నారు. పునాది విధివిధానాలు రూపొందించి పటిష్ఠంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆంగ్ల మాధ్యమ తరగతులకు సకాలంలో ఉపాధ్యాయులు, వసతులను కల్పించకపోవడం విచారకరమని ఆయన అన్నారు.