దీక్ష విరమించిన మాజీ సైనికులు

12

ఢిల్లీ : ఒకే ర్యాంకు ఒకే పింఛనును ప్రకటించాలంటూ గత మూడు నెలలుగా నిరశన దీక్ష చేపట్టిన మాజీ సైనికులు నేడు విరమించారు. ఈ మేరకు తాము దీక్షను విరమిస్తున్నట్లు మాజీ సైనికుల నేత సత్బీర్‌సింగ్‌ ప్రకటించారు. ఓఆర్‌ఓపీ ప్రకటించిన కేంద్రప్రభుత్వానికి, ప్రధాని నరేంద్రమోదీకి కృతజ్ఞతలు తెలిపారు. అయితే తమ పూర్తి డిమాండ్లను తీర్చేవరకు రిలే దీక్షలు చేపడుతామని తెలిపారు. పెండింగ్‌ డిమాండ్లను ప్రభుత్వం పరిశీలించకపోతే మరోసారి నిరాహార దీక్ష చేసేందుకు వెనకాడబోమని సత్బీర్‌సింగ్‌ చెప్పారు. అన్ని ప్రాంతాల్లోని మాజీ సైనికులు దీక్ష విరమించాలని ఆయన కోరారు. గత నాలుగు దశాబ్దాలుగా ఒకే ర్యాంకు ఒకే పింఛను అంశం ప్రభుత్వాల మధ్య నలుగుతూనే వచ్చింది. ఎట్టకేలకు శనివారం కేంద్ర రక్షణశాఖ మంత్రి మనోహర్‌ పారికర్‌ ఒకే ర్యాంకు ఒకే పింఛనును ప్రకటించారు. ఈ పథకం ద్వారా మాజీ సైనికులందరికీ ఒకే ర్యాంకు ఆధారంగా ఒకే పింఛను వర్తిస్తుంది. పథకాన్ని అమలుచేయడానికి ఏకసభ్య న్యాయకమిటీని కూడా నిర్ణయించారు. అయితే ముందస్తు విరమణ చేసేవారికి ఈ పథకం వర్తించదని ప్రభుత్వం పేర్కొంది. అంతేగాక, మాజీ సైనికులు కోరినట్లుగా రెండేళ్లకోసారి కాకుండా ప్రతి ఐదేళ్లకోసారి పథకాన్ని సమీక్షిస్తామని ప్రభుత్వం తెలిపింది. దీంతో దిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద గత మూడు నెలలుగా నిరాహార దీక్ష చేపట్టిన మాజీ సైనికులు నేడు దీక్ష విరమిస్తున్నట్లు ప్రకటించారు. ఓఆర్‌ఓపీ ప్రకటించినందుకు సంతృప్తిగా ఉన్నప్పటికీ ప్రభుత్వం తమ డిమాండ్లన్నింటినీ తీర్చలేదని మాజీ సైనికులు అంటున్నారు. మిగిలిన డిమాండ్లను ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిందని, వాటిని కూడా తీర్చేవరకు రిలే దీక్షలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఒకవేళ పెండింగ్‌ డిమాండ్లను ప్రభుత్వం విస్మరిస్తే మరోసారి నిరాహార దీక్షకు దిగుతామని మాజీ సైనికులు ప్రకటించారు.