దీపావళితో పత్తి అమ్మకాల జోరు
కరీంనగర్,అక్టోబర్18(జనంసాక్షి): మార్కెట్ ధరల్లో హెచ్చుతగ్గులు సహజమేనని,రైతులు ఇది గుర్తించాలని జమ్మికుంట మార్కెట్ కమిటీ ఛైర్మన్ పింగిళి రమేశ్ అన్నారు. నాణ్యతను బట్టి ధరలు మారుతుంటాయని అన్నారు. గ్రేడింగ్‌తో ధరను నిర్ణయిస్తున్నామని, నాణ్యతగా ఉన్న పత్తికి అధిక ధరలు చెల్లుబాటు చేస్తున్నామని అన్నారు. వ్యాపారులు ఇతర మార్కెట్ల కంటే కొందరు రైతులకు పత్తికి అధిక ధర చెల్లించి మిగతా వారికి మొండిచేయి చూపుతున్నారన్న విమర్శుల ఉన్నాయి. ధరల విషయంలో రైతులకు న్యాయం చేసేందుకు వ్యాపారులతో బిడ్డింగ్‌కు ముందే సమావేశం నిర్వహించి జాగ్రత్తలు తీసుకుంటున్నామని వివరించారు. రైతులు తీసుకువచ్చిన వ్యవసాయ ఉత్పత్తులకు మంచి ధరను ఇప్పించడానికే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. మార్కెట్‌కు వచ్చిన పత్తిలో అత్యధిక పత్తికి ధర తగ్గించి కొనుగోళ్లు చేస్తున్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దీపావళి పండుగ నేపథ్యంలో పత్తిని విక్రయించాల్సి వస్తుందని, అయినా ఆశించిన ధర రాలేదని పలువురు రైతులు వాపోయారు. జమ్మికుంట మార్కెట్‌లో పత్తికి మంచి ధరను పెట్టాలని, సంచుల పత్తికి బిడ్డింగ్‌ను గద్దెల వారీగా నిర్వహించాలని రైతులు సూచిస్తున్నారు.