దీర్ఘకాలిక వ్యవసాయ ప్రణాళిక రచించాలి
రైతుల కోసం తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ప్రోత్సాహం అందిస్తున్నా ప్రకృతి మాత్రం సహకరిం చడం లేదు. రైతుల కోసం ఎన్నో పథకాలు చేపట్టినా అక్కడక్కడా ఇంకా ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సమస్యలపై ప్రభుత్వాలు అధ్యయనం చేయాలి. నీరు, విద్యుత్,పెట్టుబడి సాయం అందించడం, చనిపోతే బీమా కల్పించడం వల్ల ఫలితం రావడం లేదు. ఇంతకు మించిన సమస్యలు ఉన్నాయని గుర్తించాలి. అన్నింటికి మించి గిట్టుబాటు ధరలు రావడం లేదన్నది నగ్నసత్యం. దీనికితోడు అందరూ రైతులను మోసం చేద్దామనుకుంటున్న వారే. అందరూ అందిన కాడికి అతడి నుంచి దోచుకుందా మనుకుంటున్న వారే…విత్తనాల కొనుగోలు దగ్గర నుంచి పంటను అమ్ముకునే వారకు అధికార, అనధికార వర్గాలు దోచుకోవం పరిపాటిగా మారింది. అందుకే జీవితాంతంత కష్టపడ్డా నాలుగు రాళ్లు వెనకేసుకోలేక పోతున్న వర్గం ఏదైనా ఉందంటే అది రైతువర్గమే. మొన్నటికి మొన్న కందులు, మిర్చి పండించిన రైతులు ఎలా దగాపడ్డారో చూశాం. ఉత్తిధరలు సామాన్యులకు కన్నీరు పెట్టిస్తున్నట్లే రైతులకు కూడా పెట్టిస్తున్నాయి. పండించిన రైతుకు మాత్రం ధరలు దక్కడం లేదు. రైతులు సొంతంగా పంటలకు దరలు నిర్ణయించుకునే రోజు వస్తేనే ఈ రంగం బాగుపడగలదు. వారికి గిట్టుబాటు ధరలు ఇవ్వడానికి కేంద్రం కూడా వెనకడుగు వేసింది. అలాగే తాజాగా నకిలీ విత్తనాలు రాజ్యమేలాయి. భారీగా నకిలీ విత్తనాల అమ్మకం జరిగినట్లు తేలింది. ఇలా ప్రతి ఒక్కరూ మోసం చేస్తూ పోతే అన్నం పెట్టే చేతులు ఆగ్రహిస్తే ఏం కావాలి. సమస్యలపై అడపాదడపా వీధుల్లోపడి రైతులు తమ నిరసనలు వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వాలకి కానరావడం లేదు. రైతులంటే నిర్లక్ష్యం రాజ్యం ఏలుతోంది. టమాటాలు కిలో 50 రూపాయలకు, ఉల్లిపాయలు కిలోకి 25 రూపాయలకు అమ్ముతున్నా అందులో రైతుకు చేరేదెంత? అంటే కాసింతే అన్నది జగమెరిగిన సత్యం. దీనిపై ప్రభుత్వాలు ఆలోచన చేయాలి. దశాబ్దాలుగా దగాపడుతున్న రైతులకు ఊరట దక్కాలి. రైతులను ఆదుకునేలా చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలు ఇచ్చేలా ప్రతి ఒక్కరూ చేయి వేయాలి. దేశాభివృద్ధి నమూనాలో వ్యవసాయ రంగం కీలకమైంది. దీనిపై కోట్లాది ప్రజలు ఆధారపడి జీవిస్తున్నారు. ఇప్పుడున్న టువంటి కరువు కాటకాల మధ్య వ్యవసాయం కాస్త కుదేలవుతున్న పరిస్థితి కనబడుతున్నది. వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకపోవడం వల్ల పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించకపోవడం ఆర్థికంగా చితికిపోయిన రైతన్నలు తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. దేశంలో అమలవుతున్న రైతు వ్యతిరేక విధానాలు కావచ్చు లేదా ఆయా రాష్ట్రాల్లో కొనసాగుతున్న విధానాల వల్ల రైతాంగం తీవ్రస్థాయిలోనే నష్టపోతున్నది. వరదలు వచ్చి నదులుపొంగి సముద్రంలోకి నీరు పోకుండా దానిని ఒడిసి పట్టుకునే నదుల అనుసంధానం వేగం అందుకోవాలి. ఇతరత్రా పథకాలకన్నా బహుళార్థసాధక ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వాలి. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ద్వారా పుడమిని కాపాడుకోవాలి. విపరీత మైన రసాయన ఎరువులతో అటు భూమి, ఇటు మనిషి నిర్వీర్యం అవుతున్నాడు. ఆహారధాన్యాలు, నిత్యావసర కూరగాయల ఉత్పత్తి, వినియోగాలలో గ్రామాలను స్వయం పోషకాలుగా అభివృద్ధి చేయాలి. గ్రామ జనాభా ఎంత? ఏయే ఆహారధాన్యాలు, కాయగూరలు ఎంత మొత్తంలో అవసరం? అందుకు రైతులకు కావలసిన మౌలికసదుపాయాల కల్పనపై ప్రభుత్వాలు దృష్టి సారించి ఆ రకంగా పంటలను పండించే విధానాలు అవలంబించాలి. తద్వారా సవిూప భవిష్యత్తులో రైతులకు గిట్టుబాటు ధరలు అందుతాయి. సరసమైన ధరలకే వ్యవసాయ ఉత్పత్తులు వినియోగదారులకు లభించనున్నాయి. రైతాంగం కోసం తెలుగురాష్ట్రాల ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేస్తున్నవనే చెప్పాలి. అయితే వ్యవసాయ ప్రణాళిక అన్నది వ్యూహాత్మకంగా
లేదు. దీంతో సాగు ముందుకు సాగడం లేదు. అలాగే వ్యవసాయరంగంలో వినూత్న మార్పులకు శ్రీకారం చుడితే నిరుద్యోగ సమస్య కూడా తీర్చడానికి అవకాశాలు వస్తాయి. అటు రైతులకు ఇటు వినియోగదారు లకు లాభముండేలా కార్యక్రమాలను రూపొందించి అమలుచేయగలగాలి. వ్యవసాయంతోనే గ్రావిూణా ఆర్థికాభివృద్ది ఆధారపడి ఉందన్న విషయం గుర్తించాలి. పూర్వం వ్యవసాయం చుట్టూ గ్రావిూణ ఆర్థిక వ్యవస్థ అల్లుకుని ఉండేది. అది ముందుకు సాగేలా మల్లీ పథకరచన సాగాలి. మరోవైపు వర్షాభావ పరిస్థితు లు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. అడపదడపా పడ్డ వర్షాలతో సాగులోకి దిగిన రైతులు మళ్లీ ఆకాశం కేసి చూస్తున్న రోజులు వచ్చాయి. తుఫాన్ల ద్వారా వచ్చే వర్షాలకోసం మళ్లీ బంగాళాఖాతం వైపు చూడాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ యేడు కూడా వర్షాలు పడతాయా లేదా అన్న భయం వెన్నాడుతోంది. ఎండలు మళ్లీ దంచి కొడుతున్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావం అంతంతమాత్రంగానే ఉంది. ఇకపోతే చెరువులు, కుంటల్లో నీరు చేరలేదు. కృష్ణాగోదావరి జలాల అందట్లేదు. ఎగువన ఆల్మట్టి నుంచి నీరురావడం లేదు. దీంతో ఈ యేడు కూడా కృష్ణాబేసిన్ ఎడారిగా మారింది. గోదావరిలో కూడా పెద్దగా నీరు రావడం లేదు. ఇకపోతే వర్షాభావం కారణంగా విత్తనం మొలకెత్తినా తడులు లేకపోతే ఎలా అన్న ఆందోళన కలుగు తోంది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించడంతో ఆలస్యంగా అయినా వర్షాలు పడతాయమన్న నమ్మకం లేకుండ ఆపోయింది. తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర లో కొన్ని ప్రాంతాల్లో తప్ప రాయలసీమలో తీవ్ర వర్షాభావ స్థితులు ఉన్నాయి. ఈ దశలో నీటి సంరక్షణ చర్యలకు పెద్దపీట వేయాలి. సకాలంలో వర్షాలు పడేలా వాతావరణ సమతుల్యతకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఇలాంటి చర్యలకు ప్రభుత్వాలు పూనుకుని యుద్దప్రాతిపదికన కార్యాచరణకు దిగాల్సి ఉంది.