దుబాయ్‌లోని టార్చ్ టవర్‌లో భారీ అగ్నిప్రమాదం
దుబాయ్: ప్రపంచంలో ఎత్తైన భవనాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన దుబాయ్‌లోని టార్చ్ టవర్‌లో శనివారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మెరీనా జిల్లాలో ఉన్న టార్చ్ టవర్‌లో మొత్తం 79 అంతస్థులు ఉండగా 50వ అంతస్థులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది హుటా హుటిన ఘటనాస్థలికి చేరుకుని 12 ఫైరింజన్లతో మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నించారు.టార్చ్‌టవర్ 1,082 అడుగుల ఎత్తైన భవంతి కావడంతో మంటలు అదుపుచేయడం అగ్నిమాపక సిబ్బందికి కష్టంగా మారింది. భవంతిలో ఉన్న వేలాదిమందిని సహాయక సిబ్బంది తరలించారు. ముందు జాగ్రత్త చర్యగా అధికారులు టార్చ్ టవర్ సమీపంలో ఉన్న భవనాలను ఖాళీ చేయించారు. అగ్ని కీలల ధాటికి టార్చ్ టవర్ భారీగా ధ్వంసమైంది. మెరీనా ప్రాంతంలో ట్రాఫిక్‌ను మళ్లించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.