దుష్కర్మలకు దూరంగా ఉండాలి

మానవుడి నిత్య దుష్కర్మలు ప్రధానంగా మూడు రకాలు. మనసు, వాక్కు, కర్మలతో అవి అతడికి తెలియకుండానే జరిగిపోతుంటాయి. చెడు ఆలోచించడం పాపానికి మొదటి మెట్టు. చెడు మాట్లాడటం, చేయడం తదుపరి మెట్లు. మనిషి తొలి మెట్టు వద్దనే ఆగిపోవాలి. కనీసం రెండో మెట్టు దగ్గరైనా నిగ్రహం కనబరచాలి. అది దాటాక, కర్మఫలం అనివార్యం.అపాయం నుంచి తప్పించేదే ఉపాయం. ధ్యాన తత్పరత, సత్సంగం, సేవాధర్మం, ఆర్తుల్ని ఆదుకోవడం వంటివి నవ విధ భక్తులుగా చెబుతారు. వాటిలో అనుకూలమైన పద్ధతి ఎంచుకోవాలి. శుద్ధి చెందిన మనసు ఎంతో తేలికపడుతుంది. అప్పుడు దానికి భక్తి పరిమళాల్ని అద్దాలి. భగవంతుడు ప్రసన్నుడవుతాడు.ఎన్ని పూజలు చేసినా, క్షణమైనా వీడని దైవచింతనే నిజ భక్తి. దానికి భక్తులు తమ జీవితాల్ని అంకితం చేసినప్పుడే, అంతర్యామి అనుగ్రహం లభిస్తుంది!
ప్రతి రోజూ- తనకు సంబంధం లేని మనిషి క్షేమం కోరి హృదయపూర్వక ప్రార్థన చేసే వ్యక్తికి అదే ఆరోగ్యం, ఆనందం! వాటి కోసం అతడు ఎక్కడికీ వెళ్లనక్కరలేదు. అలా ప్రార్థన చేస్తున్నప్పుడే, శరీరంలో మార్పులు కలుగుతాయి. మనసులో చక్కటి భావ ప్రకంపనలు ఏర్పడి, ధ్యానంగా మారి, రోగాల్ని దూరం చేస్తాయి. ఇది యోగుల బోధసర్వుల హితం కోరడంలో ప్రేమ ఇమిడి ఉంటుంది. ఎవరి కోసం వారే ఉంటే, ఆ జీవితం నిష్ఫలం. దానికి ప్రాముఖ్యం, అర్థం ఉండవు. మనిషి జీవితం ఏ క్షణం నుంచి ఇంకొకరి కోసం సాగుతుందో, ఆ క్షణం నుంచే సేవాభావం వెలుగొందుతుంది. సేవ కేవలం హృదయానికి సంబంధించినదై ఉండాలి. దాన్ని ఆలోచనలు, మాటలు అనుసరించాలి. ఆలోచనను హృదయం ఎప్పుడూ మంచి దారిలోనే నడిపిస్తుంది. హృదయం ఒక దిక్సూచి. ప్రేమకు అది కేంద్రస్థానం. సేవ, ప్రేమల్ని మనిషి కళలుగా నేర్చుకోవాలి. అదే సమగ్ర జీవిత కళ. అహంకారాన్ని విడనాడాలి. ఉపనిషత్తులకు ప్రాధాన్యాల పట్టిక ఉంది. అందులో అన్నింటికన్నా ముందు ఉండేది మానవత్వమే.సకల జీవరాశులూ చల్లగా ఉండాలన్న భావన పెరిగేకొద్దీ, మనిషి అసలైన ఆనందానికి అర్థం తెలుసుకుంటాడు. అటువంటి నామస్మరణ ఉన్న చోట, మంచి వెల్లివిరుస్తుంది. అప్పుడే రుషులు సంతోషిస్తారని, దేవతలు దీవిస్తారని ఉపనిషత్‌ వాక్యం!