దూకుడు పెంచిన టిఆర్‌ఎస్‌ అభ్యర్థి సంజయ్‌

వ్యక్తిగతంగా ప్రముఖులను కలుస్తూ ప్రచారం

జగిత్యాల,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): జగిత్యాలలో టిఆర్‌ఎస్‌ అబ్యర్థి డాక్టర్‌ సంజయ్‌ కుమారు దూకుడు పెంచారు. టిక్కెట్‌ ఖరారు కావడంతో ఇక నేరుగా ముఖ్యులను కలుస్తూ మద్దతు పలకాలని కోరుతున్నారు. తనను గెలిపించి అవకాశం ఇవ్వాలని అంటున్నారు. గత నాలుగేళ్లుగా ఆయన ప్రజల్లోనే ఉంటూ అందరితో కలసి మాట్లాడుతున్నారు. నియోజకవర్గ ప్రజలకు వ్యక్తిగతంగా, వృత్తిపరంగా 25 ఏళ్లుగా సేవలందిస్తున్నాని అన్నారు. ప్రజలకు మరిన్ని సేవలందించేందుకు గత ఎన్నికల్లో ఓడినా.. నాలుగేళ్లుగా ప్రభుత్వ పథకాలు ప్రజల దరి చేసేందుకు తనవంతు కృషి చేశానన్నారు. నిజామాబాద్‌ ఎంపీ కవిత సహకారంతో జగిత్యాల పట్టణంతో పాటు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశానన్నారు.టీఆర్‌ఎస్‌ ప్రజల కోసం ప్రజల కోసం పని చేస్తుందని, సీఎం కేసీఆర్‌ నిబద్ధత కలిగిన వ్యక్తని, ప్రజల కోసం నిరంతరం ఆలోచిస్తున్నారని చెప్పారు. అందుకే దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలు చేస్తున్నారన్నారు. తెలంగాణను ఆదర్శంగా తీసుకొని పలు రాష్ట్రాలు అక్కడ అమలు చేస్తున్నాయన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రజలు టీఆర్‌ఎస్‌కే ఓటు వే యాలని కోరారు. తనను పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన సీఎం కేసీఆర్‌, ఎంపీ కవితకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్‌ దగా కోరు పార్టీ అని, కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉండి బడుగు, బలహీనవర్గాల అభివృద్ధికి చేసింది ఏవిూలేదని సంజయ్‌కుమార్‌ విమర్శించారు. గత కాంగ్రెస్‌, టీడీపీ హయాంలో రూ.5కోట్లకు మించి నిధులు మ జూరు కాలేదన్నారు.