దేవాలయంలో దొంగ… పట్టించిన ఫేస్‌బుక్…!

సోమవారం, 16 ఫిబ్రవరి 2015  జ‌నంసాక్షి

దేవాలయంలో చొరబడిన దొంగను ఫేస్‌‌బుక్ పట్టించింది. భక్తుల మాదిరిగా దేవాలయాలకు వెళ్లి అక్కడ ఉన్న విగ్రహాలను దొంగిలిస్తూ తప్పించుకు తిరుగుతున్న వ్యక్తిని, అతని వద్ద వాటిని కొనుగోలు చేస్తున్న ఇద్దరిని నల్లకుంట పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రెండు లక్షల విలువైన మూడు ఇత్తడి, పంచలోహ విగ్రహాలను పోలీసులు స్వాధీనం చేసుకుని, వారిని రిమాండ్‌కు తరలించారు. 

నల్లకుంట పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాచిగూడ ఏసీపీ సీహెచ్ లక్ష్మీనారాయణ, ఇన్‌స్పెక్టర్ జైపాల్‌రెడ్డి, డీఐబీ, సైదా విగ్రహాలను చోరీ చేసే వ్యక్తుల వివరాలను బయటపెట్టారు. విద్యానగర్‌లో నివసించే పోలపల్లి శ్రీనివాస్(48) వీఎస్‌టీ వద్ద గల అగర్వాల్ ఇండస్ట్రీస్‌లో పనిచేసేవాడు. ఆ సంస్థ మూత పడటంతో పనిపాట లేకుండా తిరుగుతూ చెడువ్యసనాలకు బానిసయ్యాడు. 
దేవాలయాల్లో భక్తుడి మాదిరిగా వచ్చి దేవతామూర్తుల విగ్రహాలను దొంగించి,వాటిని విక్రయించగా వచ్చే డబ్బుతో జల్సాలు చేసేవాడు. 2010లో శ్రీనివాస్ చిలుకలగూడ పోలీసుస్టేషన్ పరిధిలోని సాయిబాబా దేవాలయంలో వినాయకుడి విగ్రహాన్ని దొంగిలించి పోలీసులకు పట్టుబడి జైలుకెళ్లాడు. విడుదలైన తరువాత శ్రీనివాస్ తన ప్రవృత్తిని మార్చుకోకుండా తిరిగి ఆలయాల్లో దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. 
ఇటీవల నల్లకుంట పోలీసుస్టేషన్ హన్‌మాన్, సాయిబాబా దేవాలయాల్లో శ్రీనివాస్ భక్తుడిగా వచ్చి నిర్వాహకులు, పూజారుల కళ్లుగప్పి ఇత్తడి, పంచలోహ విగ్రహాలను తస్కరించాడు. వాటిని రామ్‌నగర్‌కు చెందిన చీకోటి యాదగిరి, పార్శిగుట్టకు చెందిన దుర్గం కిశోర్‌కు విక్రయించాడు. కేసు నమోదు చేసుకున్న నల్లకుంట పోలీసులు దేవాలయాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించి శ్రీనివాస్‌ను గుర్తించారు. 
సీసీ దృశ్యాలను పోలీసు ఫేస్‌బుక్‌లో పెట్టారు. శ్రీనివాస్‌ను గుర్తించిన ఓ వ్యక్తి అతని ఎక్కడో ఉంటాడో పోలీసులకు సమాచారం అందించాడు. రంగంలోకి దిగిన క్రైమ్‌పోలీసులు ఆదివారం నిందితుడు శ్రీనివాస్‌ను, అతని వద్ద విగ్రహాలను కొన్న చీకోటి యాదగిరి, దుర్గం కిశోర్‌ను అరెస్టు చేశారు.