దేవాలయ భూముల ఆక్రమణదారులకు చెక్కులా?
రైతుబందు పథకాన్ని అట్టహాసంగా ప్రారంభించబోతున్న ప్రభుత్వం ఈ కార్యక్రమంలో లోటుపాట్లను ముందే గుర్తించి ప్రకటించి ఉంటే బాగుండేది. ప్రధానంగా ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు, దేవాదాయ భూములు, వక్ఫ్ భూములకు సంబంధించిన సర్వేలో తేలిన నిజాలు ప్రకటించడం లేదు. వేలాది ఎకరాలు రాజకీయ నేతలు, వారి అనుచరుల కబంధ హస్తాల్లో ఉన్నాయి. వాటి వివరాలు సర్వే సందర్భంగా ప్రకటించలేదు. ప్రధానంగా దేవాదాయ భూములు వేలాది ఎకరాలు ఉన్నాయి. వాటికి సంబంధించి రైతు బంధు పథకం కింద ఎవరి ఖాతాలో జమచేస్తారో ప్రకటించలేదు. వాటిని అన్యాయంగా,అక్రమంగా స్వాధీనం లో ఉంచుకుని అనుభవిస్తూ దేవుడికే శఠగోపం పెట్టిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపడం లేదు. అన్నదాత గురించి గొప్పగా ఆలోచన చేసిన సిఎం కెసిఆర్ దగుల్బాజీల గురించి పట్టించుకున్నట్లుగా లేదు. దేవాదాయ, వక్ఫ్ భూములపై కఠిన చర్యలు తీసుకుంటే ఇక చెక్కులు అందుకుంటున్న ఆక్రమణ దారులు పక్కా పట్టాదురులుగా మారిపోగలరు. అందువల్ల ఇప్పటికూ భూసర్వేలో ఉన్న వివరాలు ప్రకటించాలి. అలాగే ప్రతి గ్రామంలో దేవాదాయ భూములపై ప్రజల అభిప్రాయాలు తీసుకోవాలి. ఎందరో దేవాదాయ అధికారులు కూడా దీనిపై గతంలో సర్వేలు నిర్వహించి అన్యాక్రాంత భూముల వివరాలను ప్రకటించారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఈ విషయంలో చోద్యం చూడడం తప్ప తన శాఖ పరిధిలో ఉన్న భూమలు రక్షణకు ఎలాంటి చర్య తీసుకున్న దాఖలాలు కనబడడంలేదు. తెలంగాణ ఏర్పడ్డ తరవాత కూడా ఈ భూములకు విముక్తి కలిగించకపోవడం దారుణం కాక మరోటి కాదు. ఇది సుప్రీం తీర్పుతో పాటు, చట్టాలను ఉల్లంఘించడమే అవుతుంది. తెలుగు రాష్ట్రాలను భూ కుంభకోణాలు కుదిపే స్తున్నాయి. వేలకోట్ల భూములను తన్నుకుపోయారు. ప్రభుత్వ భూములు కనిపిస్తే మాఫియాదారులు హాంఫట్ అనిపించారు. ఎన్నో ఏళ్లుగా ఈ అక్రమాలు సాగుతున్నాయి. గతంలో పదేళ్లు అధికారం వెలగబెట్టిన కాంగ్రెస్, అంతకుముందు పదేళ్లు అధికారం వెలగబెట్టిన టిడిపి హయాంలో ఈ భూముల కుంభకోణాలకు బీజాలు పడ్డాయి. గ్రామాల్లో దేవాదాయ, వక్ఫ్ భూములకు రోణ లేకుండా చేశారు. దీంతో ఆలయాలు ధూపదీప నైవేద్యం కింద ఆధారపడాల్సి వచ్చింది. ఇకపోతే ఇటీవలి భూకుంభకోణాలు చూస్తే విస్తుగొలిపే విషయాలు వెల్లడవుతున్నాయి. హైదరాబాద్, విశాఖ కేంద్రంగా ప్రస్తుతం బయటపడ్డ కుంభకోణాలకు సంబంధించి సమగ్ర విచారణను వేగవంతగా పూర్తి చేయాల్సి ఉంది. మియాపూర్ భూకుంభకోణం చూస్తే భూ బకాసురులు ఎంతగా తెగించారో గుర్తించవచ్చు. హైదరాబాద్‌లో ప్రభుత్వ భూమి అందుబాటులో ఉండటమే దోపిడీకి కారణం అయ్యింది. శ్రీకాకుళం నుంచి ఆదిలాబాద్ వరకు మెరుగైన జీవితం, ఉపాధి కావాలనుకున్నవారందరూ ఉపాధి కోసం హైదరాబాద్‌కు వస్తున్నారు. ఇతర రాష్ట్రాలలో సరైన ఉపాధి లభించనివారు కూడా హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు. దీంతో ఇక్కడ రియల్ మాఫియా కోరలు సాచింది. విశాఖ జిల్లా పెందుర్తి మండలం ముదపాక అసైన్డ్ భూముల వ్యవహారం కూడా ఇలాగే ఉంది. విశాఖ రూరల్ చినగదిలి మండల పరిధిలోని కొమ్మాది, మధురవాడ, పరిసర గ్రామాల్లో భూ దస్త్రాల తారుమారు, రికార్డుల ట్యాంపరింగ్ వెనుక ఎంతోమంది ఉన్నారు. కేవలం రెండు గ్రామాల పరిధిలోనే దాదాపు 226 ఎకరాల దస్త్రాలు మారిపోయాయి. ఈ మొత్తం వ్యవహారాలన్నీ బట్టబయలు అయ్యాయి. వేలాది కోట్ల భూములను లాక్కున్న దుండగులనుఎంతకఠినంగా శిక్షించినా తక్కువే. ఇదే అదనుగా అసలు ప్రభుత్వ భూముల పక్కా లెక్కలు తీయాలి. ఎపితో పోలిస్తే తెలంగాణలో బీడు భూములు ఎక్కువ. అందుకే రాయలసీమ గూండాలు ఇక్కడ భూదందాలు అనేకం చేశారు. హైదారాబాద్ చుట్టుపక్కల భూములను కబ్జాచేసి మింగారు.
ఖాళీజాగా కనిపిస్తే కాజేశారు. ఇప్పటికే వేలాది ఎకరాలు మాయమ య్యాయి. అనేక ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయ్యాయని ఆందోళన సర్వత్రా ఉంది. అలాగే దళితులు, గిరిజనుల భూములను అక్రమంగా లాగేసుకుని రాజకీయ నేతలు అనుభవిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో పదేళ్ల పాటు చక్రం తిప్పిన ముఖ్యనేతలు ఇలాంటి కుంభకోణాల్లో ఉన్నారు. తెలంగాణ తో పోల్చుకుంటే ఏపీలో ప్రభుత్వ భూముల లభ్యత తక్కువ. ప్రైవేటు భూముల ధరలు చుక్కలను చేరుకుంటున్నాయి. దీంతో గద్దలు వాలి భూములను కాజేశారు. భూసర్వే ప్రకారం రికార్డును సరిచూసిన అధికారులు అన్యాక్రాంత భూముల విషయంలో స్పష్టత ఇవ్వాలి. చెక్కుల పంపిణీలో ఇలాంటి భూమలు విషయాలను పక్కన పెట్టాలి. క్షేత్రస్థాయిలోనే వీటిపై కఠినంగా వ్యవహరించాలి. భూ బకాసురులను అడ్డుకోవాలి. అన్నదాతలను ఆదుకునేందుకు ఉద్దేశించిన ఈ పథకం దుర్వినియోగం కాకుండా చూడాలి. దేనికైనా ఒక అడుగంటూ పడితే పది అడుగులు ముందుకు సాగుతాం. అధికారులు కఠినంగా ఉంటే అక్రమాలకు అడ్డుకట్ట వేయగలం. రైతులు బాగుపడేందుకు ప్రతి ఒక్కరూ ప్రభుత్వానికి అండగా నిలవాలి. రైతులు కూడా తమ భవిష్యత్ కోసం పంటలను వేయడం మొదలు, పురుగుమందులు వాడడం, అమ్మకాల వరకు తగుజాగ్రత్తలు పాటించాలి. అప్పుడే వ్యవసాయం పండగగా మారగలదు. ఈ సందర్భంలోనే అక్రమాల గుట్టు తెలియాలి. దేవాదాయ తదితర భూములకు చెక్కులను ఎవరి పేరున ఇస్తారో చెప్పాలి. ఆక్రమణలను తొలగించి భూములను స్వాధీనం చేసుకుని దేవాలయాలను పరిపుష్టం చేయాలి. అప్పుడే ప్రభుత్వం చిత్తశుద్ది కూడా కనిపిస్తుంది.