దేశంలోనే పుష్కలమైన మానవ వనరులు కలిగిన రాష్ట్రం తెలంగాణ: మంత్రి కేటీఆర్
దేశంలోనే పుష్కలమైన మానవ వనరులు కలిగిన రాష్ట్రం తెలంగాణ: మంత్రి కేటీఆర్
జీనోమ్ వ్యాలీని మరో 250 ఎకరాల్లో విస్తరించబోతున్నట్టు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు తెలిపారు. మూడో దశ విస్తరణ కొనసాగుతున్నదని, ఇప్పటికే 132 ఎకరాలను ఇందుకోసం సమీకరించామని చెప్పారు.
గురువారం హైదరాబాద్ శివారులోని జీనోమ్ వ్యాలీలో భారత్ సీరమ్స్ అండ్ వ్యాక్సిన్స్ (బీఎస్‌వీ) సంస్థ కొత్త యూనిట్‌కు మంత్రి కేటీఆర్ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జీనోమ్ వ్యాలీ విస్తరణ ప్రతిభగల యువతకు మరిన్ని అవకాశాలను అందించగలదన్నారు.
ఈ క్రమంలోనే రూ.200 కోట్లతో కొత్త యూనిట్ ఏర్పాటు చేస్తుండటం, అందులో మహిళలు ఎదుర్కొనే అనేక సమస్యలకు సంబంధించిన ఉత్పత్తులు తయారు చేయడం సంతోషకరమన్నారు. బీఎస్‌వీకి భవిష్యత్తులోనూ అన్నివిధాలా సహకరిస్తామని తెలిపారు. ఇక ప్రపంచానికి వ్యాక్సిన్ రాజధానిగా హైదరాబాద్ మారిందని ఏ దేశానికెళ్లినా గర్వంగా చెప్పగలనన్నారు. ప్రపంచంలో తయారయ్యే వ్యాక్సిన్లలో 33 శాతం హైదరాబాద్ జీనోమ్ వ్యాలీ నుంచే ఉత్పత్తి అవుతున్నాయన్నారు. హైదరాబాద్‌లో ఏటా 900 కోట్ల వ్యాక్సిన్లు తయారవుతున్నాయని, వచ్చే ఏడాది నుంచి 1,400 కోట్ల వ్యాక్సిన్లు ఇకడి నుంచే ఉత్పత్తి అవుతాయని పేరొన్నారు. దీంతో ప్రపంచ వ్యాక్సిన్ల ఉత్పత్తిలో సుమారు 50 శాతం మనదే అవుతుందన్న ధీమాను వ్యక్తం చేశారు.
మహిళా ఆరోగ్య సంరక్షణకు పెద్దపీట
రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆరోగ్య సంరక్షణకు అధిక ప్రాధాన్యతనిస్తున్నదని కేటీఆర్ తెలిపారు. తెలంగాణలో ప్రతిష్ఠాత్మకంగా ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని చేపట్టామని గుర్తుచేశారు. తాను స్వతహాగా బయోటెక్నాలజీ స్కూడెంట్‌నన్న ఆయన.. అందుకే బీఎస్‌వీ ఎండీ,సీఈవో సంజీవ్ నవాంగుల్‌ను కలిసిన వెంటనే మహిళల సంరక్షణకు ఉపయోగపడేవి ఏమేం ఉన్నాయని అడిగిమరీ తెలుసుకున్నట్టు వివరించారు. కాగా, స్వతంత్ర భారతంలో వైద్య రంగాన్ని నిర్లక్ష్యం చేశారన్నారు. గడిచిన 65 ఏండ్లలో తెలంగాణలో 5 మెడికల్ కాలేజీలే ఉంటే, ఆ సంఖ్యను తొమ్మిదేండ్లలోనే సీఎం కేసీఆర్ 33కు పెంచారన్నారు. ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇదో గొప్ప నిదర్శనమని వ్యాఖ్యానించారు.
యువశక్తిని వాడుకోవాలి
ప్రపంచంలో భారత్ అతిపెద్ద రీస్టోర్ కంట్రీ అని కేటీఆర్ అన్నారు. దేశంలో యువకులు ఎక్కువగా ఉన్నారని చెప్పారు. 27 ఏండ్లలోపువాళ్లే 50 శాతం మంది ఉన్నారని, 35 ఏండ్లలోపువారు 65 శాతం మంది ఉన్నారని, ప్రపంచంలోని మరే దేశంలో ఇంత యువశక్తి లేదన్నారు. కానీ.. దేశంలో యువత కోసం ఆలోచించే ప్రభుత్వాలు లేవన్నారు. కాగా, దేశంలోనే పుష్కలమైన మానవ వనరులు కలిగిన రాష్ట్రం తెలంగాణ అని స్పష్టం చేశారు. దేశంలో ఎకడాలేని అనుకూలతలు తెలంగాణలో ఉన్నాయన్నారు. పారిశ్రామికీకరణ, ఉపాధి కల్పనలో తెలంగాణ ప్రభుత్వం వేగంగా దూసుకెళ్తున్నదని చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు సంబంధించి కేంద్రం ఇచ్చే ర్యాంకుల్లో నంబర్ వన్‌గా తెలంగాణ ఉన్నది గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కూర్మయ్యగారి నవీన్ కుమార్, టీఎస్‌ఐఐసీ వైస్ చైర్మన్ ఈవీ నరసింహా రెడ్డి, తెలంగాణ ప్రభుత్వ లైఫ్ సైన్సెస్ అండ్ ఫార్మా డైరెక్టర్ నాగప్పన్ తదితరులు పాల్గొన్నారు.
ఒక పరిశ్రమను ఆకర్షించడం వెనుక ఎంతో కష్టం దాగి ఉంటుంది. మరో రాష్ర్టానికో, దేశానికో వెళ్లకుండా తెలంగాణకే దాన్ని తీసుకురావడానికి ఎన్నో ప్రయత్నాలు చేయాలి. కొత్త కంపెనీ వస్తే యువతకు ఉద్యోగాలు వస్తాయి. ఎంతోమందికి జీవనోపాధి లభిస్తుంది. రాష్ట్రం ఆర్థికంగా బలపడుతుంది. ప్రైవేట్ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చినప్పుడే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మెరుగు పడుతుంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెనైనా, దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీగానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు.. అందరి ముందున్న అతిపెద్ద సవాళ్లు ఉద్యోగ-ఉపాధి కల్పన, సంపద సృష్టే. ఈ విషయంలో తెలంగాణ పటిష్ట ప్రణాళికతో ముందుకెళ్తున్నది. కేవలం తొమ్మిదేండ్లలోనే ఎన్నో అద్భుతాలు చేశాం. సంపదను సృష్టించి, దాన్ని తిరిగి ప్రజల కోసమే ఖర్చు చేస్తున్నాం. తద్వార ఆర్థికంగా ఎంతో ఎత్తుకు ఎదిగాం. తెలంగాణ ఏర్పడే నాటికి తలసరి ఆదాయం రూ.1.12 లక్షలే. నేడు రూ.3.17 లక్షలతో దేశంలోనే అగ్రస్థానానికి చేరాం. ప్రస్తుతం దేశ సగటు తలసరి ఆదాయం రూ.1.47 లక్షలుగానే ఉన్నది.
-కేటీఆర్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి
మా ఈ కొత్త యూనిట్ ప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం అందించిన సహాయం గొప్పది. జీనోమ్ వ్యాలీలో రూ.200 కోట్లతో పదెకరాల్లో బీఎస్‌వీ యూనిట్‌ను తెస్తున్నాం. ఇక్కడ మహిళల ఆరోగ్య సంరక్షణ, ఐయూఐ-ఐవీఎఫ్ చికిత్స తదితరాలకు సంబంధించిన ఉత్పత్తుల్ని, ర్యాబిస్ వ్యాక్సిన్లను, ఇమ్యునోగ్లోబులిన్స్, హార్మోన్లకు సంబంధించిన ఔషధాలను తయారు చేస్తాం. ప్రపంచ మార్కెట్‌తో భారత్ సీరమ్స్ అండ్ వ్యాక్సిన్స్ పోటీ పడుతున్నది.
-సంజీవ్ నవాంగుల్, బీఎస్‌వీ ఎండీ, సీఈవో