దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ది పథకాలు
కరీంనగర్,జనవరి5(జనంసాక్షి): దేశంలో ఎక్కడా లేని విధంగా ఎన్నో బృహత్తరమైన పథకాలు ప్రవేశపెట్టి ఏ ప్రభుత్వమూ ఎన్నడూ చేయని అభివృద్ధిని సిఎం కెసిఆర్ చేసి చూపుతున్నారని ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ వివరించారు. ఒక వైపు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా పింఛన్లు, డబుల్ బెడ్ రూం ఇండ్లు, నిరుపేదలకు భూములు, రైతుల పంటలకు రూ.8 వేలు, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ వంటి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి మాత్రమే దక్కుతుందని స్పష్టం చేశారు. ఇది చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ యువకులను ఆర్థికంగా అభివృద్ధి పరచడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. అనేక సంక్షేమకార్యక్రమాల్లో దళితులకు పెద్దపీట వేస్తూ వారికి సహకారం అందిస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వాల కాలంలో 50 శాతం సబ్సిడీతో రుణాలు మంజూరు చేసేవారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ నిరుద్యోగులైన యువతీ యువకులకు ఉపాధి అందించాలనే లక్ష్యంతో సబ్సిడీని 80 శాతానికి పెంచారని గుర్తుచేశారు.