దేశంలో కర్షకులే పెద్ద కుటుంబం

1

కిసాన్‌ టీవీ ఛానెల్‌ ప్రారంభించిన ప్రధాని

న్యూఢిల్లీ,మే26(జనంసాక్షి): దేశంలో రైతులదే అతి పెద్ద కుటుంబమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. దిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో దూరదర్శన్‌ కిసాన్‌ ఛానల్‌ను  ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ 200 ఏళ్ల క్రితం యూరియా, పొటాషియం అనేవే లేవని… సేంద్రియ ఎరువుల ద్వారానే రైతులు హెక్టారుకు 15 నుంచి 18 టన్నుల ధాన్యం దిగుబడి సాధించేవారని తెలిపారు.ప్రధానిగా ఏడాది పాలనను పురస్కరించుకుని మంగళవారం ఢిల్లీ విజ్ఞాన్‌ భవన్లో జరిగిన కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. కిసాన్‌ టీవీ చానెల్‌ రైతుల కోసం 24 గంటలూ పనిచేస్తుందని మోదీ చెప్పారు. వ్యవసాయం రంగంలో మెరుగైన ఫలితాలు సాధించాలంటే  ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం చాలా అవసరమని అన్నారు. ఉన్నత విద్య చదువుకున్న యువత వ్యవసాయరంగం వైపు ఆకర్షితులవుతున్నారని మోదీ పేర్కొన్నారు. యువత సాంకేతిక పరిజ్ఞానంతో అధిక దిగుబడులు సాధిస్తున్నారని చెప్పారు.  నూతన సాంకేతిక పరిజ్ఞనం వచ్చిన తరువాత దిగుబడి, ఖర్చు రెండూ పెరిగాయి. వ్యవసాయం, గ్రామాలు, దేశం ఒకదానికొకటి ముడిపడి ఉంటాయి. వ్యవసాయంతో గ్రామాలు, గ్రామాల అభివృద్ధితో దేశాభివృద్ధి జరుగుతుంది. లాల్‌బహదూర్‌ శాస్త్రి ఇచ్చిన జైకిసాన్‌ పిలుపునకు

దేశమంతా స్పందించింది. ఆయన ఇచ్చిన జైకిసాన్‌ నినాదం రైతుల్లో స్పూర్తి నింపింది. ప్రస్తుతం కొన్ని దేశాల్లో హెక్టారుకు సగటున మూడు టన్నుల దిగుబడి ఉంది. భారత్‌లో రెండు టన్నులే ఉంది. గ్రామాల్లో అధునిక పరిజ్ఞనంతో సాగు చేస్తే యువత కూడా వ్యవసాయ రంగంవైపు వస్తుంది. దేశంలో సగంమంది రైతులకు తమకో శాఖ, మంత్రి, విధానాలు ఉన్నాయని తెలియదు. జీవనోపాధి బాటలో అత్యుత్తమమైనది వ్యవసాయం, తర్వాతే వ్యాపారం, ఉద్యోగం అని మోడీ అన్నారు.