దేశంలో కొనసాగుతున్న కరోనా ఉధృతి
కరోనా నుంచి బయటపడ్డ మంత్రి స్మృతి ఇరానీ
చికిత్స పొందుతూ బిజెపి ఉత్తరాఖండ్ ఎమ్మెల్యే మృతి
న్యూఢిల్లీ,నవంబర్12(జనంసాక్షి): భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. దేశంలో మహమ్మారి ఉధృతి కొనసాగుతూనే ఉంది. నిత్యం వందల సంఖ్యలో జనం వైరస్‌కు బలువుతున్నారు. అలాగే ఎంతో ప్రముఖులు సైతం ప్రాణాలను కోల్పోయారు.గడిచిన 24 గంటల్లో 47,905 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 86,83,917కు చేరాయి. బుధవారం 550 మంది కరోనాతో మరణించగా మరణాల సంఖ్య 1,28,121కు చేరింది. నిన్న దేశ వ్యాప్తంగా 52,718 మంది కోలుకోగా ఇప్పటి వరకు 80,66,501 మంది డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు గురువారం కేంద్ర వైద్యారోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. చదవండి: కరోనా నుంచి కోలుకున్న ప్రతి ఐదుగురిలో..ప్రస్తుతం 4,89,294 యాక్టివ్ కేసులు ఉన్నాయి. నిన్న 11,93,358 కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించగా మొత్తం 12,19,62,509 టెస్టులు పూర్తి చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ తెలిపింది. దేశంలో రికవరీ రేటు 92.89గా ఉంది. మరణాల రేటు 1.48గా ఉంది. ఇదిలావుంటే ఇటీవల కరోనా బారినడ్డ కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా జరిపిన కరోనా పరీక్షల్లో ఆమెకు నెగిటివ్ అని తేలింది. గత నెల 28న బీహార్‌లోని బోధ్‌గయ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆమెకు కరోనా సోకింది. దీంతో అప్పటి నుంచి ఆమె క్వారంటైన్‌లో ఉన్నారు. తాజాగా జరిపిన పరీక్షల్లో తనకు కరోనా నెగిటివ్‌గా తేలిందని ఇవాళ ఉదయం ట్వీట్ చేశారు. ‘నేను కరోనా పరీక్ష చేయించుకోగా, అందులో నెగిటివ్ అని వచ్చింది. తాను కరోనా నుంచి కోలుకోవాలని కోరుతూ ప్రార్థనలు చేసిన ప్రతిఒక్కరికి నా కృతజ్ఞతలు’ అని పేర్కొన్నారు. తాజాగా.. ఉత్తరాఖండ్ బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ జీనా (50) కరోనా వైరస్‌తో కన్నుమూశారు. కరోనా వైరస్ బారినపడ్డ ఆయన ఢిల్లీలోని సర్ గంగారామ్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందారు. రెండు వారాల కిందట కరోనా వైరస్ నిర్దారణ కావడంతో ఆయనను చికిత్స కోసం ఢిల్లీలోని సర్ గంగారాం ఆస్పత్రికి తరలించారు.చికిత్స పొందుతున్న జీనా ఆరోగ్యం క్రమంగా క్షీణించడంతో కన్నుమూ శారు. ఇంతకు ముందు సురేంద్రసింగ్ భార్య ధర్మాదేవి సైతం ఇటీవల కరోనా బారినపడ్డారు. అదే సమయంలో ఆమెకు గుండెపోటు రావడంతో కన్నుమూశారు. సురేంద్రసింగ్ ప్రస్తుతం అల్మోరా జిల్లా స్టాల్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. ఇదే స్థానం నుంచి ఆయన మూడుసార్లు విజయం సాధించారు. ఆయన మృతిపై బీజేపీ నేతలు దిగ్భాంతి వ్యక్తం చేశారు.