దేశంలో బర్డ్‌ఫ్లూ
– కేంద్రం అప్రమత్తత
– రాష్ట్రాలకు అలర్ట్‌గా ఉండాలని సూచన
– పరిస్థితిని సవిూక్షించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్
దిల్లీ,జనవరి 6(జనంసాక్షి): దేశంలోని పలు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ అనుమానిత కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ముందు జాగ్రత్త చర్యలకు ఉపక్రమించింది. ప్రస్తుత పరిస్థితిపై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్ని రాష్ట్రాలకు సూచనలు జారీ చేసింది. అలాగే ఫ్లూ నివారణ చర్యలు, ఎప్పటికప్పుడు పరిస్థితిని సవిూక్షించేందుకు కేంద్ర పాడి పశుసంవర్థకశాఖ ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను కూడా ఏర్పాటు చేసింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, కేరళ, హిమాచల్ ప్రదేశ్‌లలో బర్డ్ ఫ్లూ కారణంగా ఇప్పటికే పెద్ద సంఖ్యలో పక్షులు మృత్యువాతపడ్డాయి. హిమాచల్ ప్రదేశ్‌లో వైరస్ కేసులు వెలుగుచూడటంతో జమ్మూకశ్మీర్ యంత్రాంగం అప్రమత్తమైంది. అలాగే హరియాణాలోని పంచకుల జిల్లాలో గత పది రోజుల్లో నాలుగు లక్షలకుపైగా కోళ్లు మరణించాయి. అయితే, వాటిలో బర్డ్ ఫ్లూ వైరస్ నిర్ధారణ కాలేదని అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా..కేరళలోని అలప్పుజ, కొట్టాయం జిల్లాల్లో దాదాపు 1700 బాతులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాయి. దాంతో ఇతర ప్రాంతాలకు వైరస్ వ్యాప్తి చెందకుండా మందుస్తు జాగ్రత్తగా కోళ్లు, బాతులను చంపే ప్రక్రియకు అధికారులు ఉపక్రమించారు. దీనికింద 40 వేలకు పైగా కోళ్లు, బాతులను వధించాల్సి ఉంటుందని సమాచారం. మరోవైపు, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు ప్రస్తుత పరిస్థితులపై దృష్టి సారించాయి.
బర్డ్‌ఫ్లూపై అప్రమత్తమైన రాష్ట్రాలు
అలప్పుజ, కొట్టాయం, ఇండోర్, జమ్మూ: బర్డ్ ఫ్లూ వైరస్ విజృంభిస్తోన్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలంటూ కర్ణాటక, తమిళనాడు, జమ్మూ-కశ్మీర్‌తో పాటు పలు రాష్ట్రాలు అటవీ, పశు సంవర్థక శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశాయి. కేరళలోని అలప్పుజ, కొట్టాయం జిల్లాల్లో దాదాపు 1700 బాతులు బర్డ్‌ఫ్లూతో మృతి చెందాయి. దీంతో ఈ జిల్లాల పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలను నియమించి కోళ్లు, బాతులను చంపే ప్రక్రియకు మంగళవారం శ్రీకారం చుట్టారు. అలప్పుజ పరిధిలోని నాలుగు పంచాయతీల్లో బుధవారం సాయంత్రం నాటికి పక్షుల సంహారం పూర్తవుతుందని అధికారులు తెలిపారు. అదేవిధంగా కొట్టాయం జిల్లాలోని ప్రభావిత ప్రాంతాల్లో 3 వేల మంది సిబ్బందిని నియమించి కోళ్లు, బాతులను చంపేందుకు ఏర్పాట్లు చేశారు. దాదాపు 40వేల కోళ్లు, బాతులను వధించాల్సి ఉంటుందని సమాచారం. కేరళలో చోటుచేసుకున్న పరిణామాలను నిరంతరం పర్యవేక్షిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని యంత్రాంగానికి తమిళనాడు సర్కారు సూచించింది. రాష్ట్ర అధికారులు అప్రమత్తంగా ఉండాలంటూ కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి సుధాకరన్ ఆదేశించారు. హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాలో ఉన్న పాంగ్ జలాశయం ప్రాంతాన్ని మంగళవారం అధికారులు సందర్శించారు. ఇక్కడ 2,700 వరకు వలస పక్షులు(బాతులు) మృతి చెందిన నేపథ్యంలో అభయారణ్యం చుట్టూ సర్వే నిర్వహించారు.బర్డ్‌ఫ్లూ కారణంగా మధ్యప్రదేశ్‌లో ఇప్పటివరకు 155 కాకులు చనిపోయాయి. పక్షులకు వైరస్ సోకిందన్న అనుమానంతో భోపాల్‌లోని పలు ప్రాంతాల నుంచి 120 కోళ్లు, 30 వలస పక్షుల నమూనాలను సేకరించి ప్రయోగశాలకు పంపినట్లు అధికారులు పేర్కొన్నారు. వాటి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నట్లు వెల్లడించారు.రాజస్థాన్‌లోని 16 జిల్లాల్లో మంగళవారం 625 పక్షులు మృతి చెందాయని.. 85 పక్షుల నమూనాలను ప్రయోగశాలకు పంపినట్లు అధికారులు తెలిపారు.హరియాణాలోని పంచకుల జిల్లాలో గత పది రోజుల్లో నాలుగు లక్షలకు పైగా కోళ్లు మృత్యువాతపడ్డాయి. జలంధర్‌లోని ప్రయోగశాలకు వీటి నమూనాలను పంపారు. ఇందులో బర్డ్‌ఫ్లూ వైరస్ నిర్ధారణ కాలేదని అధికారులు వెల్లడించారు.ఇప్పటివరకు మహారాష్ట్రలో ఒక్క బర్డ్‌ఫ్లూ కేసు నమోదు కాలేదని ఆ రాష్ట్ర అధికారులు పేర్కొన్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో బర్డ్‌ఫ్లూ కేసులు వెలుగు చూడటంతో జమ్మూ-కశ్మీర్ ప్రభుత్వం అధికారులకు పలు సూచనలు చేసింది.
‘మాంసం, గుడ్లను బాగా ఉడికించి తినండి’
దిల్లీ: ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా (బర్డ్‌ఫ్లూ) కారణంగా గత పదిరోజులుగా దేశ వ్యాప్తంగా లక్షల పక్షులు మరణిస్తుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ మేరకు పరిస్థితిని సవిూక్షించేందుకు కేంద్రం ప్రత్యేక కంట్రోల్‌రూంను ఏర్పాటు చేసింది. పరిస్థితిపై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్ని రాష్ట్రాలకు సూచనలు జారీ చేసింది. ఈ వైరస్ మానవులకు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర పాడి, పశుసంవర్ధకశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ట్విటర్‌లో తెలిపారు. ” ప్రజలంతా మాంసం, గుడ్లను తినేటపుడు బాగా ఉడికించి తినాలి. భయపడాల్సిందేవిూ లేదు. పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది.” అని ఆయన ట్వీట్ చేశారు. దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ బర్డ్‌ఫ్లూను గుర్తించారన్న నివేదికను కూడా ఆయన విడుదల చేశారు.
యూరోపియన్ దేశాలపై పంజా..
గత కొన్ని వారాలుగా యూరోపియన్ దేశాల్లో కూడా బర్డ్‌ఫ్లూ ప్రభావం కనిపిస్తోంది. నెదర్లాండ్స్, జర్మనీ, ఫ్రాన్స్, బెల్జియం, యునైటెడ్ కింగ్‌డమ్, డెన్మార్క్, స్వీడన్, పోలండ్, క్రొయేషియా, ఉక్రెయిన్‌లలో బర్డ్‌ఫ్లూను కనుగొన్నామని యూరోపియన్ సెంటర్ ఫర్ డిసీజ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ (ఈసీడీసీ) వెల్లడించింది. ఫ్రాన్స్‌లో సుమారు ఆరు లక్షలకు పైగా పౌల్ట్రీ పక్షులను వధించారు. జర్మనీలో 62వేల టర్కీ, బాతులను వధించినట్లు అధికారులు తెలిపారు. ఈ వైరస్ పక్షుల నుంచి మనుషులకు వ్యాపించే ప్రమాదముందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ప్రస్తుతానికి మానవుల మధ్య సంక్రమించే అవకాశం లేదని వెల్లడించింది.