దేశంలో వ్యవస్థలు ప్రమాదంలో పడ్డాయి


– కేంద్రం రాజకీయ కక్షసాధింపు చర్యలతో ముందుకెళ్తుంది
– భాజపా యేతర పార్టీలతో కూటమి
– కలిసొచ్చే పార్టీలతో ముందుకెళ్తాం
– ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
– పవార్‌, ఫరూక్‌తో భేటీ అయిన చంద్రబాబు
– దేశంలోని తాజా పరిణామాలతో చర్చ
– దేశాన్ని ఎలా రక్షించాలనేదానిపై చర్చించా
– శరత్‌ పవార్‌, ఫరూక్‌ అబ్దుల్లా వెల్లడి
న్యూఢిల్లీ, నవంబర్‌1(జ‌నంసాక్షి) : భాజపా పాలన విధానంతో దేశంలోని వ్యవస్థలన్నీ ప్రమాదంలో పడ్డాయని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. భాజపా యేతర పార్టీలతో కూటమి ఏర్పాటు లక్ష్యంతో తెదేపా అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన చేపట్టారు. ఈ పర్యటనలో భాగంగా ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ నివాసంలో పవార్‌తో పాటు ఫరూక్‌ అబ్దుల్లాతోనూ చంద్రబాబు భేటీ అయ్యారు. సాధారణ ఎన్నికలు, దేశంలో జరుగుతున్న పరిణామాలు, కేంద్ర ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపు చర్యలతో పాటు వివిధ పార్టీల నేతలు, సంస్థలపై జరుగుతున్న దాడులపై చర్చించారు. సీబీఐ, ఆర్బీఐ వంటి కేంద్ర వ్యవస్థల నిర్వీర్యం తదితర అంశాలపై ముగ్గురు నేతలూ కలిసి చర్చించారు. భేటీ ముగిసిన అనంతరం సంయుక్త విూడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. శరద్‌పవార్‌, ఫరూక్‌ అబ్దుల్లా ఎంతో గొప్ప నేతలని, భవిష్యత్తులో ఎలా ముందుకు వెళ్లాలో వారితో చర్చించినట్లు చెప్పారు. దేశంలోని వ్యవస్థలు ప్రమాదంలో పడ్డాయని సీఎం ఆందోళన వ్యక్తంచేశారు. మిగతా పార్టీల నేతలతోనూ కలిసి మాట్లాడతామని, భాజపా యేతర పార్టీలతో కలిసి ముందుకు నడుస్తామని స్పష్టం చేశారు. భవిష్యత్తు తరాల సంక్షేమం కోసం నిర్ణయాలు
తీసుకోవాలన్నారు. భాజపాకు వ్యతిరేకంగా భవిష్యత్తు ప్రణాళికను రూపొందించాలని చెప్పారు. భాజపా వ్యతిరేక శక్తులన్నింటినీ కూడగడుతున్నామని, తమతో కలిసి వచ్చే అన్ని పార్టీలతోనూ పనిచేస్తామని వెల్లడించారు.
దేశాన్ని ఎలారక్షించాలనేదానిపై చర్చించాం – ఫరూక్‌ అబ్దుల్లా
భాజపా విధానాలతో దేశం అతిపెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత ఫరూక్‌ అబ్దుల్లా ఆందోళన వ్యక్తంచేశారు. దేశాన్ని ఎలా రక్షించుకోవాలనే అంశంపైనే  చంద్రబాబు, పవార్‌లతో భేటీలో చర్చించినట్టు చెప్పారు. సీబీఐ, ఆర్బీఐలో జరుగుతున్న పరిణామాలు దేశాన్ని సంక్షోభంలోకి నెడుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక రచించి దానిపై పని చేస్తామన్నారు. ప్రజాస్వామ్యాన్ని, దేశాన్ని ఎలా కాపాడుకోవాలి అనే అంశాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించినట్టు చెప్పారు. మేం ముగ్గురం సమన్వయ కర్తలమని, కూటమిలో ఏవిధంగా ముందుకెళ్లాలని, ఎవరెవరితో సంప్రదింపులు చేయాలో సమనక్వయ కర్తలగా వ్యవహరిస్తామన్నారు. కనీస ఉమ్మడి ప్రణాళిక కోసం అన్ని పార్టీలతో చర్చిస్తామని ఆయన తెలిపారు.
ఆజాద్‌తో భేటీ అయిన చంద్రబాబు..
హస్తిన పర్యటనలో ఉన్న ఆంధప్రదేశ్‌ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యులు గులాంనబీ ఆజాద్‌ను కలిశారు. ఇద్దరు నేతల మధ్య దాదాపు 15 నిమిషాల పాటు చర్చలు జరిగాయి. తన ఢిల్లీ పర్యటనలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో సమావేశం కానున్న చంద్రబాబు… ఉదయమే గులాంనబీ ఆజాద్‌ను కలిశారు. అయితే ఇది ఎయిర్‌పోర్ట్‌లో యాదృచ్చికంగానే జరిగిన భేటీ అని టీడీపీ నేతలు అంటున్నారు.