దేశం గర్వించే విధంగా ఎఫ్‌బీఐని పునర్నిర్మిస్తాం : కాశ్ పటేల్
అమెరికా దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) డైరెక్టర్‌గా భారతీయ అమెరికన్ కాశ్ పటేల్ నియామకాన్ని గురువారం సెనెట్ ఆమోదించింది. ఈ నేపథ్యంలో కాశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికన్లకు హాని చేయాలని చూస్తే సహించబోనని ఆయన స్పష్టం చేశారు. ఈమేరకు ఆయన ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు.
‘ఎఫ్‌బీఐ (FBI) తొమ్మిదో డైరెక్టర్‌గా నన్ను నియమించడం ఎంతో గౌరవంగా ఉంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అటార్నీ జనరల్ పామ్ బోండికి కృతజ్ఞతలు. ఎఫ్‌బీఐకి ఎంతో ఘన చరిత్ర ఉంది. దేశ ప్రజలకు పారదర్శకంగా, జవాబుదారీగా ఉండేందుకు బ్యూరో కట్టుబడి ఉంది. దేశం గర్వించే విధంగా ఎఫ్‌బీఐని పునర్నిర్మిస్తాం. అమెరికన్లకు ఎవరైనా హాని చేయాలని చూస్తే.. వారి అంతు చూస్తాం’ అని ఆయన రాసుకొచ్చారు. ఇదిలాఉండగా.. ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా కాశ్ పేరును అలస్కాకు చెందిన రిపబ్లికన్‌తో పాటు పలువురు డెమోక్రట్లు వ్యతిరేకించారు. అయితే 51-49 ఓట్ల తేడాతో ఆయన నియామకం జరిగింది. దీంతో ఈ పదవిని చేపట్టిన తొలి హిందూ, భారతీయ అమెరికన్‌గా ఆయన నిలిచారు.అధ్యక్షుడు ట్రంప్ నకు వీరవిధేయుడిగా కాశ్‌కు పేరుంది. పటేల్ కుటుంబ మూలాలు గుజరాత్‌లో ఉన్నాయి. ఆయన తల్లిదండ్రులు తూర్పు ఆఫ్రికాలో పెరిగారు. ఉగాండా నియంత ఈదీ ఆమిన్ బెదిరింపుల కారణంగా అతడి తండ్రి అమెరికాకు వలస వచ్చారు. 1980లో న్యూయార్క్‌లోని గార్డెన్ సిటీలో పటేల్ జన్మించారు. యూనివర్శిటీ ఆఫ్ రిచ్‌మాండ్‌లో గ్రాడ్యుయేషన్.. యూనివర్శిటీ కాలేజ్ లండన్‌లో న్యాయవిద్యను పూర్తి చేశారు. ఆ తర్వాత ఒక లా సంస్థలో పని చేయాలనుకున్నా కొలువు లభించలేదు. దీంతో ఆయన మియామీ కోర్టుల్లో పబ్లిక్ డిఫెండర్‌గా పనిచేసి వివిధ హోదాల్లో సేవలందించారు.