దేశం చూపు అటే.. నేటి నుంచి పార్లమెంటు సమావేశాలు
` కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం
` కొత్త పార్లమెంట్ ముందు జెండా ఆవిష్కరణ
` పాల్గొన్న రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖర్ ,లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా
` దిల్లీలో అఖిలపక్ష భేటీ..
న్యూఢల్లీి(జనంసాక్షి): సోమవారం నుంచి ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖర్ ఆదివారం ఉదయం నూతన పార్లమెంట్ భవనం వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు. సోమవారం నుండి ఐదు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో ఒకరోజు ముందు నూతన పార్లమెంట్ భవనం ప్రధాన ద్వారం ఎదుట జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో పాటు కేంద్ర మంత్రులు పీయూష్‌గోయల్, ప్రహ్లాద్ జోషి, అర్జున్ రామ్ మేఘ్వాల్‌లు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముందు పార్లమెంటులో విధులు నిర్వహించే సిఆర్‌పిఎఫ్ బృందం వేర్వేరుగా గౌరవ వందనాన్ని సమర్పించారు. ఇదో చారిత్రక క్షణమని, నూతన యుగపు మార్పునకు భారత్ సాక్షిగా నిలుస్తోందని కార్యక్రమం అనంతరం ధన్‌ఖర్ విూడియాతో అన్నారు. భారత దేశ శక్తి, సహకారాన్ని ప్రపంచం మొత్తం గుర్తించిందని అన్నారు. అలాగే నేడు అఖిల పక్ష సమావేశం కూడా జరగనుంది. అయితే ఆలస్యంగా సమాచారం ఇచ్చిన కారణంగా తాను ఈ కార్యక్రమానికి హాజరుకాలేకపోతున్నాని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే పేర్కొన్నారు. తనకు సెప్టెంబర్ 15వ తేదీ సాయంత్రం సమాచారం వచ్చిందని ఖర్గే రాజ్యసభ సెక్రటరీ జనరల్ పి.సి.మోడీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఆలస్యంగా సమాచారం ఇవ్వడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి) సమావేశాలు జరుగుతున్నాయి.
దిల్లీలో అఖిలపక్ష భేటీ..
దిల్లీ: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో ఆదివారం సాయంత్రం అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ భేటీలో తెదేపా ఎంపీలు తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు వ్యవహారాన్ని లేవనెత్తారు.ఈ అంశాన్ని పార్లమెంట్‌లోనూ ప్రస్తావించనున్నట్టు చెప్పారు. అఖిలపక్ష భేటీ అనంతరం తెదేపా ఎంపీ రామ్మోహన్ నాయుడు విూడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అక్రమ అరెస్టును సమావేశంలో లేవనెత్తినట్టు చెప్పారు. ఇదే అంశాన్ని పార్లమెంట్‌లోనూ ప్రస్తావిస్తామన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కేసులో చంద్రబాబును సెప్టెంబర్ 9న సీఐడీ అధికారులు అరెస్టు చేయడం రాజకీయ ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా చంద్రబాబు అక్రమ అరెస్టును తీవ్రంగా నిరసిస్తూ రోడ్లపైకి వచ్చి ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం కేంద్రం నిర్వహించిన అఖిలపక్ష భేటీలో ఈ అంశాన్ని తెదేపా ఎంపీలు లేవనెత్తారు.మరోవైపు, ఈ భేటీలో అన్ని విపక్ష పార్టీలూ మహిళా రిజర్వేషన్ బిల్లును ఈ పార్లమెంట్ సెషన్‌లోనే ఆమోదించాలని డిమాండ్ చేసినట్టు లోక్‌సభలో కాంగ్రెస్ సభాపక్ష నేత అధిర్ రంజన్ చౌధురి తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని విజ్ఞప్తి చేసినట్టు భాజపా మిత్రపక్షమైన ఎన్సీపీ రెబల్ వర్గం నేత ప్రఫుల్ పటేల్ వెల్లడిరచారు. ఈ బిల్లును ప్రవేశపెడితే ఏకగ్రీవంగా ఆమోదం పొందుతుందని తాము విశ్వసిస్తున్నామన్నారు. సెప్టెంబర్ 19న గణేష్ చతుర్థి శుభ సందర్భంలో పార్లమెంట్ కొత్త భవనంలోకి మారనుందన్నారు. కొత్త పార్లమెంట్ భవనం నుంచి కొత్త శకం ఆరంభం కావాలన్న బీజేడీ ఎంపీ పినాకి మిశ్రా.. మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని కోరారు. కశ్మీర్‌లో ప్రాణాలు కోల్పోయిన భద్రతా సిబ్బందికి అఖిలపక్ష భేటీలో నివాళులర్పించినట్టు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై సరైన సమయంలో తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.