దేశం మార్పు కోరుకుంటుంది – జగ్నేష్‌

అహ్మదాబాద్‌,డిసెంబర్‌ 19,(జనంసాక్షి):ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వరాష్ట్రమైన గుజరాత్‌లో బీజేపీ 150 సీట్లు తెచ్చుకుంటామని పదేపదే చెప్పింది. కానీ 182 సీట్లున్న గుజరాత్‌లో బీజేపీ గెలుచుకుంది 99 స్థానాలు మాత్రమే. ఈ నేపథ్యంలో బీజేపీపై దళిత హక్కుల నేత జిగ్నేష్‌ మేవానీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మార్పు కోసం దేశం సిద్ధంగా ఉందని ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ‘దేశం మార్పునకు సిద్ధంగా ఉంది. అందువల్లే 150 సీట్లు విూరు లక్ష్యంగా పెట్టుకున్నా.. 99 సీట్లు మాత్రమే తెచ్చుకున్నారు. ఇది ఆరంభం మాత్రమే. మార్పు కోసం తర్వలో తుఫాన్‌ రాబోతుంది’ అని జిగ్నేష్‌ ట్వీట్‌ చేశారు. గుజరాత్‌ ఫలితాల నేపథ్యంలో దేశం సంస్కరణలకు సిద్ధంగా ఉందని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా జిగ్నేశ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. మోదీ స్వస్థలమైన వాద్‌నగర్‌ను ప్రస్తావిస్తూ ఆయనపై జిగ్నేష్‌ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘వాద్‌నగర్‌కు చెందిన వ్యక్తికి వాడ్‌గామ్‌ ప్రజలు తగిన బదులు ఇచ్చారు. మూడు, నాలుగు రోజుల్లో వాద్‌గామ్‌ నుంచి వాద్‌నగర్‌ వరకు 50కిలోవిూటర్ల రోడ్‌షో నిర్వహిస్తాం. పారిశుద్ధ్య కార్మికుల ఆందోళనకు సమాయత్తం అవుతున్నాం’ అని ఆయన అన్నారు. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో వాడ్‌గామ్‌ నియోజకవర్గం నుంచి జిగ్నేశ్‌ మేవాని గెలుపొంది.. తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్న సంగతి తెలిసిందే. గుజరాత్‌ ఉనాలో దళితులపై గోరక్షకుల దాడికి వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించిన వారిలో జిగ్నేష్‌ ప్రముఖుడు. ఈ క్రమంలో దళిత హక్కుల నేతగా ఆయన గొంతుకను వినిపిస్తున్నారు.