దేశపాలన నవోన్ముఖం

ఢిల్లీ అత్యాచార ఘటన హేయమైనది : రాష్ట్రపతి
న్యూఢిల్లీ, జనవరి 25 (జనంసాక్షి) :
దేశ పాలన నవోన్ముఖమని భారత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఢిల్లీలో ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. ఢిల్లీ అత్యాచార ఘటన హేయమైన చర్య అని పేర్కొన్నారు. ఈ ఘటన దేశ ప్రజల హృదయాలను కలచివేసిందని, ఒక మహిళ పట్ల హేయంగా వ్యవహరించడం ద్వారా మన జాతి ఆత్మను గాయపరిచామని తెలిపారు. ‘యావత్‌ జాతి తన నైతికతను పునరుద్ధరిం చుకున సమయం ఆసన్నమైంది. నిరాశావాదాన్ని అనుమతించరాదు. మనం ఎక్కడ ఆగిపోయిందో  తెలుసుకోవటానికి మన ఆత్మను లోతుగా శోధించాలి. చర్చలు, పొందికైన అభిప్రాయాల ద్వారా సమస్యలకు పరిష్కారాలు దొరకుతాయి. పాలన అనేది హితానికి ఒక   ఉపకరణంగా ప్రజలు విశ్వసించాలి. మనం సత్పరిపాలన అందించాలి” అని ప్రణబ్‌ ముఖర్జీ పిలుపునిచ్చారు. మార్పునకు నాంది పలికే యువ భారతీయులు పల్లెలు, పట్టణాల్లో ఉన్నారని, భవిష్యత్తు వారిదేనని అభిప్రాయ పడ్డారు. నవ భారతాన్ని మన చట్టాలు ప్రతిబింబిస్తున్నాయా.. లేక వాటికి పెను సంస్కరణలు అవసరమా అన్న సందేహాలను సమూలంగా తుడిచిపెట్టేలని కోరారు. ఎన్నికైన ప్రజా ప్రతినిధులు ప్రజల విశ్వాసాన్ని తిరిగి గెలుచుకోవాలని పిలుపునిచ్చారు. ఆర్థిక వృద్ధి తాలూకూ ఫలాలు అవసరార్థులకు అందేలా మనం చూడాలని, దేశంలో పెరుగుతున్న జనాభాకు ఆకలి భూతం, కనీస సౌకర్యాల లేమిని పారద్రోలే దిశగా సంపదను సృష్టించాలన్నారు. భారత్‌ గత ఆరు దశాబ్దాల్లో ఎంతగానో మార్పు సాధించింది. గత 60 సంవత్సరాల కన్నా వచ్చే 10 సంవత్సరాల్లో దేశం మరింత మార్పు సాధిస్తుందని నేను హామీ ఇస్తున్నానని తెలిపారు.