దేశప్రజలందరికీ ఉచిత కరోనా వ్యాక్సిన్‌

కేంద్రమంత్రి ప్రతాప్‌ సారంగి వెల్లడి
భువనేశ్వర్‌,అక్టోబర్‌26(జ‌నంసాక్షి): దేశంలోని పౌరులందరికీ ఉచితంగా కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ ఇస్తామని కేంద్ర మంత్రి ప్రతాప సారంగి చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న బీహార్‌ రాష్ట్రంలోనే కాకుండా దేశంలో అందరికీ ఉచితంగా వ్యాక్సిన్‌ ఇస్తామని కేంద్రమంత్రి ప్రకటించారు. బాలాసోర్‌ ఉప ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించిన మంత్రి సారంగి ఈ విషయం చెప్పారు. ప్రతీ వ్యక్తికి కొవిడ్‌ టీకా వేయడానికి రూ.500 ఖర్చు చేస్తామని మంత్రి చెప్పారు. ఎన్నికలు జరిగే బీహార్‌ లో ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్‌ ఇస్తామని బీజేపీ ప్రకటించడంతో ప్రతిపక్ష పార్టీలు వివాదాన్ని లేవనెత్తాయి.ఒడిశా ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్ర మంత్రులు ప్రతాప సారంగి, ధర్మేంద్ర ప్రధాన్‌ లను ఒడిశాలో ప్రజలకు వ్యాక్సిన్‌ అందించడంపై ఒడిశా రాష్ట్ర మంత్రి ఆర్పీ స్వైన్‌ ప్రశ్నించారు. దీంతో కేంద్రమంత్రి స్పందిస్తూ దేశ పౌరులందరికీ కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఇస్తామని ప్రకటించారు.తమిళనాడు, మధ్యప్రదేశ్‌, అసోం, పుదుచ్చేరి ప్రభుత్వాలు తమ రాష్టాల్ర ప్రజలకు కొవిడ్‌ వ్యాక్సిన్లను ఉచితంగా ఇస్తామని ప్రకటించాయి. ఈ నేపథ్యంలో దేశ పౌరులందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్‌ ఇవ్వాలని ఢిల్లీ సీఎం అర్వింద్‌ కేజీవ్రాల్‌ డిమాండు చేశారు.