దేశప్రజలందరికీ కరోనా టీకా పంపిణీ చేస్తాం

– జనవరి 13లోపే వ్యాక్సిన్‌ పంపిణీ మొదలు

– వెల్లడించిన కేంద్ర ఆరోగ్యశాఖ

దిల్లీ,జనవరి 5(జనంసాక్షి):కరోనా మహమ్మారిని ఎదుర్కొనే వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగం కింద భారత్‌లో అనుమతి వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌ పంపిణీకి సిద్ధంగా ఉన్నామని.. ఈ కార్యక్రమాన్ని పదిరోజుల్లోనే మొదలు పెట్టనున్నట్లు తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. వ్యాక్సిన్‌ అనుమతి పొందిన తేదీ(జనవరి 3) నుంచి పదిరోజుల్లోపే టీకా పంపిణీ ప్రారంభిస్తామని తెలిపింది.వ్యాక్సిన్‌ పంపిణీ కోసం ఇప్పటికే ప్రత్యేక టీకా నిల్వ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ కేంద్రాల్లో నిల్వ ఉంచిన వ్యాక్సిన్లను, వాటి ఉష్ణోగ్రతలను సాంకేతిక పరిజ్ఞానంతో ఎప్పటికప్పుడు పర్యవేక్షించే వీలుంటుందని ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌ వెల్లడించారు. దేశంలో ఈ తరహా విధానాన్ని దశాబ్దకాలం నుంచి అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రధాన టీకా నిల్వ కేంద్రాలను హరియాణాలోని కర్నల్‌, ముంబయి, చెన్నై, కోల్‌కతా నగరాల్లో ఏర్పాటు చేశామని.. వీటితో పాటు కేంద్ర ఔషధ నిల్వ సంస్థ(ఎంఎస్‌ఓ) ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా మొత్తం 37 వ్యాక్సిన్‌ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇక్కడ నుంచి ఆయా ప్రాంతాలకు టీకా సరఫరా చేస్తామని వెల్లడించారు.దేశవ్యాప్తంగా వ్యాక్సిన్‌ సరఫరా గొలుసు ఎలా ఉంటుందనే విషయంపైనా కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టతనిచ్చింది. వ్యాక్సిన్‌ ఉత్పత్తి సంస్థలు తొలుత కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని నాలుగు ప్రధాన టీకా నిల్వ కేంద్రాలకు పంపిస్తాయని.. అక్కడనుంచి దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న 37 టీకా నిల్వ కేంద్రాలకు తరలిస్తామని పేర్కొంది. అనంతరం వాటిని జిల్లా స్థాయి నిల్వ కేంద్రాలకు, తద్వారా టీకా అందించే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సరఫరా చేస్తామని వెల్లడించింది. వ్యాక్సిన్‌లను నిల్వ చేసుకునేందుకు ప్రస్తుతం దేశంలో 29వేల కోల్డ్‌చైన్‌ కేంద్రాలు ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది.కరోనా వ్యాక్సిన్‌ను అందించే వివరాల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కో-విన్‌ యాప్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, కరోనా పోరులో ముందున్న (ఆరోగ్య సిబ్బంది) పేర్లను కో-విన్‌లో నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదని.. ఇప్పటికే వారి సమాచారం కేంద్రం వద్ద ఉందని ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.ఇదిలా ఉంటే, దేశంలో కరోనా పాజిటివిటీ రేటు 5.87శాతానికి తగ్గిందని.. గతవారం ఇది 1.97శాతం మాత్రమేనని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రెండున్నర లక్షల క్రియాశీల కేసులు ఉండగా.. వీటిలో కేవలం 44శాతం మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నట్లు తెలిపింది. మిగిలిన 56.04శాతం మంది ¬ంఐసోలేషన్‌లో ఉన్నట్లు కేంద్రం పేర్కొంది.

కొవిడ్‌ వ్యాక్సిన్‌ పొందడమెలా?

దేశీయ ఔషధ దిగ్గజ సంస్థ భారత్‌ బయోటెక్‌ రూపొందించిన కొవాగ్జిన్‌, ఆక్స్‌ఫర్డ్‌ – ఆస్ట్రాజెనెకా సౌజన్యంతో పుణెలోని సీరం ఇన్‌స్టిట్యూట్‌ అభివృద్ధి చేసిన కొవిషీల్డ్‌ వ్యాక్సిన్లను అత్యవసర పరిస్థితుల్లో వినియోగించుకునేందుకు డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) అనుమతిచ్చిన విషయం తెలిసిందే. క్రమంగా దేశంలో అందరికీ కొవిడ్‌ వ్యాక్సిన్లను అందుబాటులోకి తెచ్చేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ వ్యాక్సిన్‌ను ఎలా పొందాలా? అనేదానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. మరోవైపు పంపిణీని పారదర్శకంగా చేపట్టేందుకు కేంద్రప్రభుత్వం కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఇంటెలిజెన్స్‌ నెట్‌వర్క్‌ (కొవిన్‌) యాప్‌ను రూపొందించింది. ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న ఆ యాప్‌.. త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానుంది. అందులో రిజిస్టర్‌ చేసుకునే వారికే వ్యాక్సిన్‌ను అందిస్తారు.