దేశరాజకీయాల్లో అనూహ్య మార్పులు

ఏకమవుతున్న ఉత్తర దక్షిణ ధృవాలు

బిజెపికి వ్యతిరేకంగా చంద్రబాబు కూటమి

బాబు రాకతో హస్తినలో మళ్లీ రాజకీయ కదలిక

విపక్షాలను ఓకేతాటిపైకి తెచ్చే యత్నం

రాహుల్‌తో కీలక భేటీలో దేశ రాజకీయాలపై చర్చ

సేవ్‌ నేషన్‌ పేరుతో మోడీకి వ్యతిరేకంగా రాజకీయ వేదిక

ఉమ్మడిగా విూడియాతో మాట్లాడిన రాహుల్‌, చంద్రబాబు

న్యూఢిల్లీ,నవంబర్‌1(జ‌నంసాక్షి): దేశ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. బిజెపికి వ్యతిరేకంగా ఉత్తర,దక్షిణ ధృవాలుగా ఉన్న కాంగ్రెస్‌,టిడిపిలు ఏకమయ్యాయి. చంద్రబాబు చొరవతో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో కొత్త రాజకీయ వేదిక సిద్దం అవుతోంది. వారం రోజుల్లో హస్తిన రాజకీయం శరవేగంగా మారింది. ఈ మార్పు ఇప్పుడు బిజెపికి ఎసరు పెట్టేలా తయారవుతోంది. బిజెపిని గద్దెదించడమే లక్ష్యంగా సేవ్‌ డెమాక్రసీ పేరుతో ఎపి సిఎం చంద్రబాబు నాయుడు చొరవ తీసుకున్నారు. ప్రాంతీయ పార్టీలను కూడగట్టి మోడీని ఢీకొనేందుకు సిద్దం అయ్యారు. ఈ మేరకు గురువారం మధ్యాహ్నం హస్తినకు చేరుకున్న చంద్రబాబు బిజీబిజీగా పలువురు నేతలతో భేటీ అయ్యారు. చివరగా ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్‌తో భేటీ అయ్యారు. ఇద్దరూ చర్చించుకోవడం…ఏకాభిప్రాయానికి రావడం కూడా చకచకా సాగిపోయాయి. అనంతరం ఇద్దరూ ఉమ్మడిగా విూడియాతో మాట్లాడుతూ బిజెపిని గద్దెదించడమే లక్ష్యంగా కార్యాచరణకు సిద్దంగా ఉన్నట్లు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం అన్ని వ్యవస్థలనూ భ్రష్టు పట్టించిందని.. ఇలాంటి పరిస్థితుల్లో దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసమే కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీని కలిశానని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. రాహుల్‌తో చర్చలు జరిపిన చంద్రబాబు.. దేశాన్ని ఎలా కాపాడుకోవాలన్న అంశంపైనే చర్చించినట్టు వివరించారు. దిల్లీలో రాహుల్‌ నివాసంలో భేటీ అనంతరం ఇద్దరు నేతలు సంయుక్తంగా విూడియాతో మాట్లాడారు. దేశాన్ని కాపాడదాం.. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిద్దాం అనే నినాదంతో ఇరు పార్టీలు కలిసి పనిచేస్తాయని చంద్రబాబు స్పష్టంచేశారు. విభజన సమస్యల పరిష్కారానికి కూడా రాహుల్‌ మద్దతిచ్చారని, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ¬దా ఇవ్వాలని కోరగా.. అందుకు ఆయన అంగీకరించారని వెల్లడించారు. రఫేల్‌ పోరాటాన్నిరాహుల్‌ ప్రజల్లోకి బాగా తీసుకెళ్లారని ప్రశంసించారు. భాజపాకు వ్యతిరేకంగా అన్ని రాజకీయపార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చి భవిష్యత్తు ప్రణాళికను సిద్ధం చేస్తామని తెలిపారు. ఆర్బీఐ, సీబీఐ, ఈడీ, ఐటీ, గవర్నర్ల వ్యవస్థ.. ఇలా అన్ని వ్యవస్థలూ సంక్షోభంలో కూరుకుపోతున్నాయని చంద్రబాబు ఆందోళన వ్యక్తంచేశారు. అన్ని రాజకీయ పార్టీలతో చర్చించి ఒక ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్తు కార్యాచరణను రూపొందిస్తామన్నారు. చంద్రబాబు మాట్లాడుతూ నేడు మన దేశాన్ని కాపాడవలసి ఉందన్నారు. ఇది ప్రజాస్వామికంగా తప్పనిసరి పరిస్థితి అన్నారు. అన్ని పక్షాలు కలిసి రావలసిన అవసరం ఉందన్నారు. తాను 40 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నానని, ఇటువంటి పరిస్థితులను ఎన్నడూ చూడలేదన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అన్ని పార్టీలూ కలిసి రావలసిన సమయం ఆసన్నమైందన్నారు. కాంగ్రెస్‌ ప్రధాన ప్రతిపక్షమని, ఇతర పార్టీలు కూడా కలిసి వస్తున్నాయని, అన్ని పార్టీలు కలిసి కూర్చొని దేశ ప్రయోజనాల దృష్ట్యా ఎన్నికల పొత్తుల గురించి ఆలోచిస్తామని అన్నారు. ప్రస్తుతం దేశాన్ని రక్షించడమే తమ కర్తవ్యమన్నారు. ప్రధాన

మంత్రి ఎవరు, ఎన్ని సీట్లలో పోటీ చేస్తారు? అని విూడియా అడిగినపుడు చంద్రబాబు ఈ విధంగా స్పందించారు. విూడియా అన్ని ప్రశ్నలు ఇప్పుడే అడుగుతోందని వ్యాఖ్యానించారు. దేశమంతా ఒకే గళం వినిపించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. వచ్చే ఎన్నికల్లో భాజపాను ఓడించి.. ప్రజాస్వామ్యాన్ని, ప్రభుత్వ వ్యవస్థలను కాపాడమే లక్ష్యంగా తమ భేటీ మంచి వాతావరణంలో సాగిందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ వెల్లడించారు. భాజపాను ఓడించడమే లక్ష్యంగా తమ పార్టీలు కలిసి పనిచేస్తాయని తెలిపారు. దేశాన్ని కాపాడుకునేందుకు భాజపా వ్యతిరేక పార్టీలన్నింటినీ ఏకం చేసి ఒకే వేదికపైకి తీసుకొస్తామని చెప్పారు. గతంలో తమ పార్టీల మధ్య వైరుధ్యాలు ఉన్న మాట వాస్తవమే అయినప్పటికీ.. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులపైనే చర్చించినట్టు రాహుల్‌ తెలిపారు. తాము పాత విషయాల జోలికి పోవడంలేదన్నారు. ప్రస్తుత, భవిష్యత్తులో జరగబోయే అంశాలపైనే దృష్టి పెడుతున్నట్టు చెప్పారు. దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఎలా ముందుకు వెళ్లాలో చంద్రబాబుతో భేటీలో చర్చించినట్టు చెప్పారు. భాజపా అన్ని వ్యవస్థలపైనా దాడి చేస్తోందని రాహుల్‌ ఆందోళన వ్యక్తంచేశారు. రాజ్యాంగ వ్యవస్థలపై జరుగుతున్న దాడిని ఆపడమే తమ లక్ష్యమన్నారు. ఉమ్మడి కార్యాచరణను ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. నిరుద్యోగం, రైతు సమస్యలు, భాజపా కుంభకోణాలపై ఉద్యమిస్తామని రాహుల్‌ వివరించారు. ఈ దశలో ప్రధాని ఎవరన్నది ముఖ్యం కాదన్నారు. రేపటి ఎన్నికల్లో ప్రజల తీర్పును బట్టి నిర్ణయం ఉంటుందన్నారు. ఇంకా రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ దేశ భవిష్యత్తును కాపాడవలసి ఉందన్నారు. మన దేశానికి ప్రస్తుతం చాలా సంక్లిష్ట సమయమని చెప్పారు. ఎన్నికల పొత్తుల గురించి విూడియా ప్రశ్నలపై రాహుల్‌ స్పందిస్తూ విూడియాకు సెన్సేషనలిజం కావాలన్నారు. దేశంలోని ప్రజాస్వామ్యాన్ని, వ్యవస్థలను కాపాడటమే ముఖ్యమని, తాము దాని గురించే ఆలోచిస్తున్నామని అన్నారు. రఫేల్‌ యుద్ధ విమానాల కుంభకోణంపై దర్యాప్తు చేయగలిగిన దర్యాప్తు సంస్థలపై దాడులు జరుగుతున్నాయన్నారు. రఫేల్‌లో అవినీతిని ప్రజలు తెలుసుకోవాలన్నారు. అందుకే తక్షణం బీజేపీని ఓడించడమే లక్ష్యమన్నారు. పార్టీల మధ్య గతంలో జరిగిన అంశాలను మర్చిపోవాలని నిర్ణయించా మన్నారు. అంతా కలిసి బీజేపీని ఓడించేందుకు ప్రయత్నించాలని నిర్ణయించామన్నారు. రాజ్యాంగంపై బీజేపీ దాడి చేస్తోందన్నారు. అన్ని వివరాలను సరైన సమయంలో తెలియజేస్తామన్నారు. యువత ముందు ఉన్న అతి పెద్ద సమస్యలు ఉపాధి కల్పన, అవినీతి అని తెలిపారు. నరేంద్ర మోదీ బహిరంగంగా మాట్లాడటానికి ఇకపై చాలా కష్టమని వ్యాఖ్యానించారు.